
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి బస్సు దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నుంచి రూ.25 లక్షల దొంగిలించి పారిపోయిన దొంగను అంతర్రాష్ట్ర దొంగగా గుర్తించారు పోలీసులు. ధార్ గ్యాంగ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ గా గుర్తించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు నార్కట్ పల్లి పోలీసులు.
అస్రఫ్ ఖాన్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా థార్ గ్యాంగ్ కు చెందిన ప్రధాన నిందితుడు. ఇతనిపై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. అరెస్టు చేసిన అనంతరం అస్రఫ్ దగ్గర నుంచి 100 శాతం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్కట్ పల్లి బస్సులో దొంగిలించిన 25 లక్షల రూపాయలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు అష్రఫ్ వద్ద నుండి రూ.25 లక్షల నగదు, కారు నంబర్ MP-09-DU-9680 గల కారు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ. 35 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో కేసును చేదించిన సి.సి.యస్ సిఐ జితేందర్ రెడ్డి, నార్కట్ పల్లి సిఐ నాగరాజు, యస్.ఐలు క్రాంతి కుమార్, కానిస్టేబుల్స్ కు రివార్డ్స్ ప్రకటించారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హోటల్ వద్ద ఆగి ఉన్న ప్రైవేటు బస్సులో ఆదివారం (ఫిబ్రవరి10) చోరీ జరిగింది. ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్పల్లి టౌన్ శివారులోని పూజిత హోటల్ వద్ద ఆగి ఉన్న బస్సులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన బ్యాగ్ నుండి రూ. 25 లక్షల నగదు చోరీ చేసి పరాపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టిన నార్కట్ పల్లి పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.