పొగమంచుకు ఆరుగురు బలి

 

  • రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకర్.. ఇద్దరూ మృతి  
  • ఘటనా స్థలానికి ఆటోలో బయలుదేరిన బైకర్ కుటుంబ సభ్యులు
  • ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం 
  • మృతుల్లో ఐదుగురిది ఒకే కుటుంబం.. గిరిజన తండాల్లో విషాదం
  • వికారాబాద్​లో చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. నిడమనూరు మండలం వేంపాడు సమీపంలో నేషనల్ హైవేపై జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినోళ్లు ఉన్నారు. ఈ రెండు యాక్సిడెంట్లు పొగమంచు కారణంగానే జరిగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్దవూర మండలం మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ శివ (19) సోమవారం రాత్రి మిర్యాలగూడ నుంచి బైక్ పై సొంతూరికి బయలుదేరాడు. రాత్రి 10 గంటల సమయంలో వేంపాడు స్టేజీ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో వేంపాడు గ్రామానికి చెందిన బల్గురు సైదులు(60) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో సైదులును శివ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సైదులు స్పాట్ లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన శివను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ మరణించాడు. 

యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకున్న శివ కుటుంబసభ్యులు మిర్యాలగూడ ఆస్పత్రికి బయలుదేరారు. పెద్దవూర మండలం నీమానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పుల్య తండా, మల్లెవానికుంట తండాకు చెందిన ఆరుగురు కలిసి టాటా ఏస్​వాహనంలో బయలుదేరారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిడమనూరు మండలం పార్వతిపురం స్టేజీ సమీపంలోకి రాగానే ఆటోను... మిర్యాలగూడ నుంచి హాలియా వైపు ఎదురుగా వస్తున్న ఆయిల్​ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ఆటోలోని రమావత్ గణ్య(40), నాగరాజు(28), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38) స్పాట్ లోనే చనిపోయారు. రమావత్​ప్రభాకర్, రమావత్​లక్ష్మి తీవ్రంగా గాయపడగా.. వాళ్లిద్దరినీ మిర్యాలగూడ  ఆసుపత్రికి తరలించారు. కాగా, మొదట యాక్సిడెంట్ జరిగిన వేంపాడు స్టేజీకి ఒక కిలోమీటర్ దూరంలోనే రెండో యాక్సిడెంట్ జరిగింది. 

రెండు తండాల్లో విషాదం.. 

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో పుల్య తండా, మల్లెవానికుంట తండాల్లో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్టమార్టం కోసం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు నిడమానూరు ఎస్సై గోపాల్​రావు తెలిపారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆటో వెళ్తున్న రూట్​కరెక్ట్​గానే ఉన్నప్పటికీ, ఆయిల్ ట్యాంకర్ మాత్రం రాంగ్​సైడ్​వెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోపాల్​రావు చెప్పారు. కాగా, మిర్యాలగూడ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి పరామర్శించారు. 

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లాలో వేర్వురు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలపై బీఆర్ఎస్​ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని, ఎక్స్​గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.