
- మిగిలిన నిందితులకుజీవిత ఖైదు
- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
- ఆరేండ్ల విచారణ అనంతరం జడ్జిమెంట్
- ఏ1 మారుతీరావు 2020లో ఆత్మహత్య
నల్గొండ, వెలుగు: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ఈ మేరకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్ పరువు హత్య అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేసింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు.
తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా మారుతీరావు, ఏ2గా బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, ఏ3గా అస్గర్ అలీ, ఏ4గా అబ్దుల్లా బారి, ఏ5గా ఎంఏ కరీం, ఏ6గా శ్రవణ్‌కుమార్ (అమృత బాబాయ్), ఏ7గా శివ (మారుతీరావు కార్ డ్రైవర్), ఏ8గా నిజాం (నిందితులను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్)ను చేర్చారు. ప్రస్తుతం వీరిలో కొంతమంది నిందితులు బెయిల్ మీద బయట ఉండగా, బెయిల్ రాకపోవడంతో సుభాష్ శర్మ జైల్లో ఉన్నాడు. కాగా, శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తిని వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించాలని కోరారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ అన్నారు. ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
పకడ్బందీగా దర్యాప్తు.
ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని కోణాల్లో విచారణ జరిపారు. 2019 జూన్ 12న 1,600 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు కేసు విచారణను అత్యంత పకడ్బందీగా చేపట్టాయి. తమిళనాడులో జరిగిన శంకరన్ హత్య తరహాలోనే ప్రణయ్ హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతను హత్యకు గురవడంతో అక్కడి కేసును చాలెంజ్‌గా తీసుకుని దోషులకు కఠిన శిక్ష పడేలా చేశారు. అదే విధంగా ఏవీ రంగనాథ్ కూడా ప్రణయ్ హత్య కేసు నుంచి దోషులు తప్పించుకోకుండా పకడ్బందీగా విచారణ చేపట్టారు. కేసులో సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో అన్ని ఎవిడెన్స్‌లు సేకరించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయించారు. నిందితులు ఏయే లోకేషన్స్‌లో కలుసుకున్నారు? అనే వివరాలను సేకరించారు. ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేయకుండా, ఎవిడెన్స్‌లను సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. దీంతో కేసు విచారణ ఎంతకాలం పట్టినా, కోర్టులో సీజ్ చేసిన ఆధారాలు తారుమారు చేయడం సాధ్యం కాదు. ప్రణయ్ హత్య జరిగి ఏడేండ్లయింది. ఇప్పుడు దోషులకు శిక్ష పడడంలో నాడు సీజ్ చేసి కోర్టుకు సమర్పించిన ఆధారాలే దోహదపడ్డాయని, దీంతోనే బాధితులకు న్యాయం జరిగిందని సీనియర్ పోలీసు ఆఫీసర్ ఒకరు చెప్పారు.
కోర్టు వద్ద ఉద్రిక్తత..
ఈ కేసులో జీవిత ఖైదు పడిన శ్రవణ్ రావు కుటుంబ సభ్యులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఏ తప్పు చేయకున్న తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్తె మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది. ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదంటూ ఆయనను తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
ఎప్పుడేం జరిగిందంటే?
2018లో పెద్దలను ఎదురించి హైదరాబాద్ ఆర్యసమాజ్‌లో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో బిడ్డ కులాంతర వివాహం చేసుకున్నదని రగిలిపోయిన మారుతీరావు.. అల్లుడు ప్రణయ్‌ని హత్య చేయాలని అస్గర్ అలీకి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. అస్గర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
ప్రణయ్‌ని హత్య చేయడానికి సుభాష్ శర్మ మిర్యాలగూడలో రెక్కీ నిర్వహించి మూడుసార్లు ప్రయత్నించి, ప్లాన్ అమలు చేయలేకపోయాడు. చివరకు అమృత మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్‌కు చెకప్ కోసం వస్తున్నదని తెలుసుకొని 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్‌ను అంతమొందించాడు.
హత్య జరగక ముందు అమృత తండ్రి మారుతీరావు ఎస్పీ, కలెక్టర్ ఆఫీసులలో అధికారులను కలిసేందుకు ప్రయత్నించినట్టు సీన్ క్రియేట్ చేశాడు. ప్రణయ్‌ని సుభాష్ శర్మ హత్య చేసిన తర్వాత మారుతీరావుకు అస్గర్ అలీ కాల్ చేసి చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు రోజుల అనంతరం హైదరాబాద్‌లో మారుతీరావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు వెల్లడించాడు.
ఆరేళ్లకు పైగా ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు 2020 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసులో నిందితులకు పడిన శిక్ష..
ఈ కేసులో ఏ2గా ఉన్న బిహార్‌కు చెందిన సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. ఏ3 అస్గర్ అలీకి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా వేసింది. ఇక ఏ4 అబ్దుల్లా బారి, ఏ5 ఎంఏ కరీం, ఏ6 శ్రవణ్ కుమార్ (అమృత బాబాయి), ఏ7 శివ (మారుతీరావు కార్ డ్రైవర్), ఏ8 నిజాం (నిందితులను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్)కు జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించింది.
ఇది చరిత్రాత్మక తీర్పు: పీపీ నరసింహ
న్యాయ వ్యవస్థలో ఇది చరిత్రాత్మక తీర్పుగా నిలిచిపోతుందని ఈ కేసులో స్పెషల్ పీపీగా ఉన్న దర్శనం నరసింహ అన్నారు. అన్ని సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టి, దోషులకు శిక్ష పడేలా చేశామని చెప్పారు. ‘‘ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు చార్జ్‌షీట్ పక్కాగా ఫైల్ చేశారు. అన్ని సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సాక్షులను ప్రవేశపెట్టడం, నిందితుల్ని గుర్తించడం, ఏ2 రిలీజ్‌కాకుండా చూడటంలో పోలీసులు కృషి ఉంది. అప్పటి జిల్లా ఎస్పీ రంగనాథ్ చార్జ్‌షీట్ ఫైల్ చేయడంలో నిజాయతీగా వ్యవహరించారు. 78 మంది సాక్షులను ప్రవేశపెట్టి విచారించాం” అని తెలిపారు.