
- రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ నుంచి 54 మందికి పోస్టింగ్
- రెండో స్థానంలో సూర్యాపేట జిల్లా
- సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదిగా నియామకపత్రాలు అందించేందుకు ఏర్పాట్లు
నల్గొండ, వెలుగు : స్థానిక సంస్థల్లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాల నిరీక్షణకు తెర పడనుంది. 10 ఏండ్లుగా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 2015 వరకు కారుణ్య నియామకాలు చేపట్టినా జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం వివిధ కారణాలతో నిలిపివేసింది. కేవలం ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఇప్పటివరకు నియమించలేదు.
ఉద్యోగుల పదవీ విరమణ గడువును 58 నుంచి 61 ఏండ్లకు ప్రభుత్వం పెంచడంతో ఖాళీలు ఏర్పడడం లేదు. జీవో 317 ప్రకారం చేపట్టిన ఉద్యోగుల విభజనలో జిల్లాలో వివిధ కేడర్ల పోస్టులన్నీ భర్తీ అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా పరిషత్ లో కారుణ్య నియమాకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భర్తీ ప్రక్రియ పూర్తి చేశారు.
పదేండ్లుగా భర్తీ కానీ పోస్టులు..
సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మృతి చెందిన ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఉద్యోగుల కుటుంబాలకు చెందిన వారసులు కారుణ్య నియామకాల కోసం జిల్లా పరిషత్అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కారుణ్య నియామకాల కింద డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, తెలుగు, ఇంగ్లిష్హయ్యర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను టైపిస్టులుగా, పదో తరగతి వరకు చదివిని అభ్యర్థులను ఆఫీస్సబార్డినేట్ ఉద్యోగాల్లో నియమిస్తారు. జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఇద్దరు పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఎడ్, బీఈ, డిగ్రీ, బీఈడీ కూడా పూర్తి చేశారు.
మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. పాఠశాలలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తూ మృతి చెందిన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన కారుణ్య నియామకాల ప్రక్రియ జిల్లా పరిషత్ అధికారులు చేపడతారు. 2015లో ఉద్యోగాల నియామకాలు చేపట్టగా జడ్పీల విభజన అనంతరం జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు లేకపోవడంతో 10 ఏండ్ల నుంచి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు తప్ప మిగిలిన పోస్టులను భర్తీ చేయలేదు.
ఎట్టకేలకు మోక్షం..
ఎట్టకేలకు జడ్పీ అధికారులు కారుణ్య నియామకాలు చేపట్టారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జడ్పీలో కారుణ్య నియామకాల కోసం పచ్చ జెండా ఊపింది. దీంతో గత వారం రోజులుగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన అధికారులు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఎంపిక పూర్తి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 54 మందిని భర్తీ చేయగా, సూర్యాపేట జిల్లాలో 50 మందిని నియమించారు. నేడో, రేపో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నియామకపత్రాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.