నల్గొండకు ఎస్ఎల్బీసీయే శరణ్యం

నల్గొండకు ఎస్ఎల్బీసీయే శరణ్యం

నాలుగు దశాబ్దాల క్రితం వెనుకబడిన, కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రజలకు రక్షిత తాగునీటిని, సాగునీటిని అందించటానికి చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్​ కెనాల్​(ఎస్​ఎల్బీబీసీ)కి నిధులు ఇవ్వకుండా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  సొరంగంలో డీవాటరింగ్ (నీటిని తొలగించేందుకు) మాత్రమే సంవత్సరానికి రూ.3 కోట్లు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన నిర్లక్ష్యం, అసమానతలు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో కొనసాగాయి.  అన్ని అనుమతులు ఉండి 70శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీకి రెండు వేల కోట్లు నిధులు కేటాయిస్తే 2018లోనే పూర్తయ్యేది. 

కృష్ణానది నల్లగొండ జిల్లా సరిహద్దుల గుండా 80  కి.మీ ప్రవహిస్తున్నది.  నల్లగొండ జిల్లా పూర్తిగా 100 శాతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 9 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిఉండగా 6 లక్షల ఎకరాలకు కూడా నీరు అందటం లేదు.  నల్లగొండ జిల్లాలో తీవ్ర దుర్భిక్ష,  కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గ గ్రామాలకు సాగునీరు,  తాగునీరు అందించాలని జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 1978లో ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆదేశంతో నిపుణుల కమిటీని వేశారు. ఆ కమిటీ సర్వే జరిపి శ్రీశైలం ఎడమ గట్టు నుంచి 300 నుంచి 500 మీటర్ల దిగువన కొండల్లో సొరంగం ద్వారా అందించవచ్చునని ప్రతిపాదన చేశారు. దీని ఆధారంగా శ్రీశైలం ఎడమగట్టు నుంచి తొమ్మిది మీటర్ల వ్యాసార్థంలో 45 కిలోమీటర్ల పొడవు సొరంగం తీసి 3.5 లక్షల ఎకరాలకు (నల్లగొండ జిల్లా 3 లక్షలు, మహబూబ్ నగర్​ జిల్లా 50వేలు) నీరు అందించాలని ప్రభుత్వం 1979లో అఖిలపక్ష  సమావేశంలో నిర్ణయించారు.1980లో నాటి  ముఖ్యమంత్రి టి అంజయ్య..  అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశారు. అయితే గ్లోబల్ టెండర్లు కోసం కొంత కాలయాపన జరిగింది.

1983లో ఎడమ, కుడి కాలువలకు శంకుస్థాపన

 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్  ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వకు 30 టీఎంసీలతో 212 గ్రామాలకు తాగునీరు, 3.5 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించాలని రూ.482 కోట్లు అంచనా వేసింది. సొరంగ మార్గానికి అక్కమ్మ బిలం కామన్ పాయింట్ కీలకమని నిర్ణయించారు. 1983 మే 4న ఎడమ గట్టు కాల్వతోపాటు కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేసి ఏకకాలంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. అదేరోజు దేవరకొండలో జరిగిన బహిరంగ సభలో 4 సంవత్సరాల కాలంలో పూర్తిచేసి నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్​ భూతాన్ని తరిమికొడతామని ప్రకటించారు. 1983-–89 వరకు రూ.45 కోట్లు ఖర్చు చేసి కొంత భూసేకరణతో పాటు కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది. 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా ప్రతినిధుల ఒత్తిడి మేరకు 1990లో ఎస్ఎల్బీసీ సొరంగ పనులు చేపట్టాలని అందుకు ఫారిన్ టెక్నాలజీ(టీబీఎం) టన్నెల్ బోరింగ్ మెషిన్ అవసరమని, అందుకు డ్రిల్లింగుకు 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుందని కేంద్ర జల సంఘం, పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోవాలని, ఆలోపు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ చేపట్టాలని నిర్ణయించినా నిధులు కేటాయించలేదు.

ఎస్ఎల్బీసీ కోసం ఆందోళన

 శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్ఆర్బీసీ)పూర్తయి ఆంధ్ర ప్రాంతానికి నీరు అందుతుండగా.. 1993–-94లో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని ఆందోళనను చేపట్టారు. 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో 1995లో సమావేశమైంది. సొరంగ నిర్మాణం ఆలస్యం అవుతుందని,  నాగార్జున సాగర్ లోతట్టు ప్రాంతమైన పుట్టంగండి నుంచి ఎత్తిపోతల ఎగువ కాలువ ద్వారా.. 2.20 లక్షల ఎకరాలకు దిగువ వరద కాలువ (సాగర్​కు వరదలు వచ్చినప్పుడు) ద్వారా 80 వేల ఎకరాలకు రెండు సంవత్సరాలలో నీరు అందిస్తామని తెలిపింది. సొరంగం పని కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. కాగా, పుట్టంగండి (ఎలిమినేటి మాధవరెడ్డి) ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టి 2001 వరకు ఎక్కువ భాగం పూర్తిచేసి ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం 60వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు. ఇంకా వరద కాలువ, పిల్ల కాలువల పనులు పూర్తిచేసి 54 చెరువు కుంటలకు నీరు అందించాల్సి ఉంది.

51కిలోమీటర్ల సొరంగం

 ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు 2014 వరకు రూ.854.60 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 51కి. మీ. సొరంగం. మొదటి టన్నెల్ -శ్రీశైలం ఎడమ గట్టు నుంచి నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వాయర్ వరకూ.. 44 కిలోమీటర్లలో 34 కి.మీ,  అదేవిధంగా రెండవ టన్నెల్ - నక్కల గండి నుంచి 7 కి.మీ పెండ్లిపాకల బ్రాంచి కాలువ వరకు పూర్తయింది.  ఇంకా 10 కిలోమీటర్ల  సొరంగాన్ని తీయాల్సి ఉంది. ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైన నక్కలగండి బ్యాలెన్స్ రిజర్వాయర్ 7 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టుటకు భూసేకరణ చేసి నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచాయి. అక్కడి నుంచి దిండి ప్రాజెక్టుకు లిఫ్ట్ చేసి దిండి సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు పెంచి,  గ్రావిటీ కాలువల ద్వారా దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుటకు, సింగరాజుపల్లి, గొట్టుముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, చర్లగూడెంలో బ్యాలెన్స్ రిజర్వాయర్లు పనులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించారు.
బీఆర్ఎస్ చారిత్రక తప్పిదం 

2014 జూన్ 2న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన

 బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ పనులను, దీనిలో అంతర్భాగంగా ఉన్న నక్కలగండి నుండి డిండి ప్రాజెక్టుకు ఎత్తిపోతల స్కీమ్, ఉదయ సముద్రం  నుంచి వెళ్లెంల స్కీమ్ పక్కకు పెట్టి చారిత్రాత్మక తప్పిదం చేసింది. అన్ని అనుమతులు ఉండి ఉమ్మడి రాష్ట్రంలోనే 30 టీఎంసీల నికర జలాలను కేటాయించి, ఎలాంటి నీటి తగాదాలు లేకుండా అప్పటికే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసి 70 శాతం పనులు జరిగినా నిర్లక్ష్యం చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన
 క్షమించరాని  తప్పిదం. వాస్తవంగా ఆనాడు సుమారు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే పూర్తి అయ్యేది.  2015లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి  డిండి ఎత్తిపోతల పథకాన్ని చేర్చింది. 2016లో  చర్లగూడెం వద్ద శంకుస్థాపన చేస్తూ  ‘నేను కుర్చీ వేసుకొని 3 సంవత్సరాలలో పూర్తి చేసి నల్లగొండ జిల్లా ప్రజల కన్నీళ్లు తుడుస్తానని’ ఆ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో గత పాలకులు వాగ్దానం చేశారు. కానీ, నేటికి ఏడేండ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

ఎస్ఎల్బీసీ పనులు తక్షణమే చేపట్టాలి

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలో అంతర్భాగంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీరు లిఫ్ట్ చేయ్యాలో ఇప్పటికీ డీపీఆర్ లేదు. ప్రాజెక్ట్ కాస్టు రూ.55,086 కోట్ల నుంచి రూ.75 వేల కోట్లకు చేరుతుందని ఇంజినీర్ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతమున్న శ్రీశైలం అంతర్భాగం నుంచి 90 టీఎంసీల మిగులు జలాలు తరలింపుపై  కృష్ణా యాజమాన్య బోర్డు పనులు నిలిపివేయాలని ఆదేశించింది.  రెండు రాష్ట్రాల మధ్య తగాదా తీవ్రమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే  80 శాతం సొరంగం పనులు, కాలువలకు భూసేకరణ జరిగింది.  సింగరాజుపల్లి, గొట్టుముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, చర్లగూడెం రిజర్వాయర్ల పనులు 70 శాతం పూర్తయ్యాయి. గతంలో సీఎం వైఎస్సార్​ సారథ్యంలో కాంగ్రెస్​ సర్కారు చేపట్టిన ఎస్ఎల్బీసీలో పూర్తికాకుండా ఉన్న 9 కిలోమీటర్లు సొరంగం పనులు, నక్కలగండి రిజర్వాయర్ పనులు అక్కడి నుంచి మిడిల్ డిండికి, అనంతరం అప్పర్ డిండి ప్రాజెక్టుకు ఎత్తిపోసేందుకు  మోటార్లు, ఎలక్ట్రిక్ వర్క్స్ మొదలగు  పనులు తక్షణమే చేపట్టాలి. రూ.5వేల కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికగా పనులు చేపట్టాలని నల్లగొండ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

సొరంగం పనులకు శ్రీకారం 

 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల ఆందోళన మేరకు ఎస్ఎల్బీసీ పనులను సమీక్షించింది.  2005 ఆగస్టు11న జీఓ నెం.147 ద్వారా రూ.2,813  కోట్ల అంచనావేసి సొరంగం పనులకు  శ్రీకారం చుట్టారు.. ఈ పనులను ప్రముఖ ఇంజనీర్ సంస్థ జయ ప్రకాష్ కంపెనీకి అప్పజెప్పారు. ఉదయ సముద్రం నుంచి బి వేల్లేమల ఎత్తిపోతల పథకం 2007లో రూ.699 కోట్లతో అదనంగా ఒక లక్ష ఎకరాలకు 6.70 టీఎంసీలు (మొదటి ఫేజ్​లో 50 వేలు, రెండవ ఫేజ్ లో 50 వేల ఎకరాలకు) నార్కట్​పల్లి, మునుగోడు, నల్లగొండ, కట్టంగూరు, నకిరేకల్ మండల గ్రామాలకు నీరు అందించేందుకు అనుమతి ఇచ్చారు. దీనికి రూ.500 కోట్లు 2014 వరకు ఖర్చు చేసి ప్రధాన కాలువ, రిజర్వాయర్లు పూర్తిచేసి,  మోటర్లకు ఆర్డర్లు ఇవ్వడంతో 80 శాతం పనులు పూర్తయ్యాయి.

-  ఉజ్జిని  రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్​ నేత