నల్లగొండ జిల్లాలో సీజ్ చేసిన గంజాయిని తగలబెట్టారు జిల్లా ఎస్పీ చందనాదీప్తి. నల్లగొండ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా 2043 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో ఇవాళ గంజాయిని నిర్వీర్యం చేశారు పోలీసులు. ఏఎస్పీ రాములు నాయక్, డిఎస్పీ శివరాం రెడ్డి, డిస్ట్రిక్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడిన ఎస్పీ చందనాదీప్తి.. నల్లగొండ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసిన సుమారు 5 కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయిని కోర్టు అనుమతితో నిర్వీర్యం చేశామన్నారు. డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలన చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నల్లగొండ పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని చెప్పారు. ఇప్పటికే సుమారు 1300 కేజీల గంజాయిని గతంలో తగలబెట్టమన్నారు. డ్రగ్ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.