
మోత్కూరు, వెలుగు: మర్డర్ కేసులో 18 మంది నిందితులకు జీవిత ఖైదు, రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ నల్గొండ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జి రోజా రమణి మంగళవారం తీర్పు ఇచ్చారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో 2014లో పండుగ రాజమల్లు అనుమానాస్పద మృతి కేసులో బట్ట లింగయ్య, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
అనంతరం బెయిల్పై వచ్చిన లింగయ్యతో పాటు కుటుంబ సభ్యులను 2017లో దసరా పండుగ రోజు సాయంత్రం రాజమల్లు కుటుంబసభ్యులు మరికొందరితో కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో లింగయ్య స్పాట్ లో చనిపోగా..అప్పట్లో ఘటన సంచల నం సృష్టించి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మృతుడి కొడుకు వెంకటేశ్ ఫిర్యాదుతో నిందితులపై అడ్డగూడూరు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి నల్గొండ స్పెషల్ సెషన్స్ కోర్టులో సమర్పించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదనలు వినిపించారు.
నిందితుల్లో జక్కుల భిక్షమయ్య చనిపోగా, మిగతా 17 మంది పండుగ రామస్వామి, పండుగ సాయిలు, పండుగ రాములు, పండుగ మల్లేశ్, బండగొర్ల వలరాజు, పండుగ యాదయ్య, జక్కుల రమేశ్, పండుగ శ్రీకాంత్, పండుగ సతీశ్, పండుగ నర్సయ్య, పండుగ సత్యనారాయణ, బండగొర్ల నాగమ్మ, పండుగ శ్రీను, పండుగ మల్లయ్య, పండుగ లింగయ్య, జక్కుల లచ్చయ్య, పోలెబోయిన లింగయ్యకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పై తీర్పు చెప్పారు. దీంతో అజీంపేటలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.