హైకోర్టుకు చేరిన టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం.. పరీక్షలు రాసేందుకు అనుమతి కోరుతూ విద్యార్ధిని పిటిషన్..

హైకోర్టుకు చేరిన టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం.. పరీక్షలు రాసేందుకు అనుమతి కోరుతూ విద్యార్ధిని పిటిషన్..

నల్గొండ జిల్లాలో కలకలం రేపిన టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. పేపర్ లీక్ ఘటనలో డీబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి పరీక్షలు రాసేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన డీబార్ ను రద్దు చేయాలని.. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇవాళ ( మార్చి 27 ) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఝాన్సీ లక్ష్మి. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, నల్గొండ డీఓ, ఎంఈఓ, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరిండెంట్ లను ప్రతివాదులుగా పేర్కొంది విద్యార్ధిని ఝాన్సీ లక్ష్మి. 

ఈ క్రమంలో ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అధికారులు, ఆకతాయిల తప్పిదానికి తనను బలిచేసారంటూ పిటీషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది విద్యార్ధిని ఝాన్సీ లక్ష్మి.

ALSO READ | బిల్లిరావు నుంచి గచ్చిబౌలి భూమిని కేసీఆర్ సర్కార్ ఎందుకు తీసుకోలేదు: రేవంత్

మార్చి 21న నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో టెన్త్  ఎగ్జామ్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఎగ్జామ్​ పేపర్​ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, నకిరేకల్  ఎంఈవో నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బార్  కోడ్  ఆధారంగా నకిరేకల్​లోని ఎస్సీ గురుకుల పాఠశాల నుంచి లీకైనట్లు గుర్తించారు. గోడ దూకి వచ్చిన వ్యక్తి పరీక్ష హాల్ కు వెళ్లి ప్రశ్నాపత్రాన్ని సెల్​ఫోన్​లో ఫొటో తీసినట్లు విచారణలో తేల్చారు. 

ఎగ్జామ్​ సెంటర్​ సీఎస్​ గోపాల్, డిపార్ట్​మెంటల్  ఆఫీసర్  రామ్మోహన్ రెడ్డిని పరీక్ష విధుల నుంచి తప్పించగా, ఇన్విజిలేటర్  సుధారాణిని సస్పెండ్  చేశారు. స్టూడెంట్​ను డిబార్  చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రశ్నాపత్రం ఫొటోలను సోషల్  మీడియాలో వైరల్  చేసింది 11 మందిగా తేల్చి అరెస్ట్ చేశారు.