- ఎమ్మెల్యేకు పోటీగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు
- సర్వేలు, ప్రజాదరణపైనే నమ్మకం పెట్టుకున్న లీడర్లు
- ఆరు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నేతల దూకుడు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య టికెట్ వార్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లు ఖాయమని ఓ వైపు సీఎం కేసీఆర్ చెబుతున్నా ఆశావహుల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. పార్టీ హైకమాండ్ సొంత సర్వేలు, ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లే చివరకు టికెట్లు డిసైడ్ చేస్తాయని ఆశావాహులు నమ్మకంతో ఉన్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. మునుగోడు టికెట్ కోసం ఎంతమంది పోటీ పడ్డా చివరికి సర్వే రిపోర్ట్‌లే క్యాండిడేట్‌ను డిసైడ్ చేశాయి. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపైన పార్టీ కేడర్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సర్వేల్లో ఆయనే ఫస్ట్ ప్లేస్‌లో ఉండడంతో హైకమాండ్ కూసుకుంట్ల వైపే మొగ్గు చూపింది. ఇదే పద్ధతి హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లోనూ అనుసరించారు. కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అంతిమంగా క్యాండిడేట్లను సర్వేలే డిసైడ్ చేశాయని, వచ్చే ఎన్నికల్లోనూ అదే జరిగి తీరుతుందని ఆశావాహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్‌లు సైతం దాదాపు అదే నమ్మకంతో ఉన్నప్పటికీ, ప్రజాదరణ కోల్పోతున్న వాళ్ల విషయంలో హైకమాండ్ మార్పులు చేసే ఆస్కారం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్వేల్లో ప్రతికూల పరిస్థితులు
సిట్టింగ్‌లు, ఆశావాహులకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగానే నడుస్తోంది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఆరింటిలో బీఆర్‌ఎస్ ఇలాంటి సమస్యే ఎదుర్కోంటోంది. ఆ నియోజకవర్గాల్లో పార్టీకి తిరుగులేదని భావిస్తున్నప్పటికీ, ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ఇంటిలిజెన్స్, సర్వే రిపోర్ట్‌లతో టెన్షన్ పడుతున్నారు. నకిరేకల్, కోదాడ, నాగార్జునసాగర్, నల్గొండ, మునుగోడు, తుంగతుర్తి నియోకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య టికెట్ వార్ గట్టిగానే నడుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సొంత ఏజెన్సీలతో సర్వే కూడా చేయించారు. నేతల మధ్య వర్గపోరు, సంక్షేమ పథకాలు, కాంట్రాక్ట్ పనుల్లో వివక్ష చూపడం వంటి అంశాలు సిట్టింగ్‌లకు ప్రతికూలంగా మారాయి. దీంతో పాటు ఇల్లీగల్ వ్యవహారాలు, ఆఫీసర్లు, ఉద్యోగుల పోస్టింగ్‌ల విషయంలో డబ్బులు వసూలు చేయడం, పార్టీ కేడర్, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలు సిట్టింగ్‌లకు మైనస్‌గా మారినట్లు సర్వే రిపోర్టులు చెబుతున్నాయి.
దూకుడు పెంచిన ఆశావాహులు
తప్పని పరిస్థితుల్లో సిట్టింగ్‌లను మారిస్తే తమకు కచ్చితంగా చాన్స్ ఉంటుందని ఆశావహులు నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకు పోటీగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నకిరేకల్‌లో మొన్నటి వరకు గ్రౌండ్ వర్క్‌పైనే దృష్టి పెట్టిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పుడు ప్రత్యక్షంగానే ఫైట్ చేస్తున్నారు. మెగా జాబ్‌మేళాలు, నిరుద్యోగులకు కోచింగ్ వంటి కార్యక్రమాలతో యువ ఓటర్లను టార్గెట్ చేశారు. ఒకప్పుడు తన గెలుపునకు సహరించిన సీనియర్లతో దోస్తీ కడుతున్నారు. కోదాడలో ఈ సారి పెరిక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు వర్గం పట్టుబడుతోంది. గతంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపు కోసం సహరించిన సీనియర్లు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడం హాట్‌టాపిక్‌గా మారింది. నాగార్జునసాగర్‌లో మళ్లీ నోముల భగత్‌కే చాన్స్ ఇస్తారని సీనియర్లు చెప్తున్నప్పటికీ, మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడు, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో వైరం ఇంకా ముదిరింది. డెవలప్‌మెంట్ వర్క్స్, నామినేటెడ్ పదవుల పంపకాల విషయంలో అభిప్రాయభేదాలు సమసిపోలేదు. నల్గొండలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా టౌన్ ప్రెసిడెంట్ పిల్లిరామరాజుయాదవ్ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. మునుగోడులో ఓ వర్గం బీసీ నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బీసీ ఓటర్లు బలంగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఈ సారి ఆ వర్గానికే చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.