- సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
- నల్గొండ జిల్లాలో 80,559,
- యాదాద్రి జిల్లాలో 34,080
- సూర్యాపేట జిల్లాలో 51,477 మంది ఓటర్లు
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : నల్గొండ, -వరంగల్, -ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్దమైంది. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిట్టింగ్ సీటును కాపాడుకొని పరువు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఆరాటపడుతోంది.
సూర్యాపేట మినహా అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడంతో విజయంపై ఆ పార్టీ ధీమాతో ఉంది. ఈ ఎన్నికల్లోనూ మోదీ ఇమేజీపైనే బీజేపీ ఆధారపడింది. ప్రచారంలోనూ మోదీ జపంతోనే బీజేపీ ముందుకు సాగింది. ఎన్నికల ప్రచారం శనివారం ముగిసినప్పటికీ.. ఆయా పార్టీల నాయకులు ఆదివారం ఓటర్లు ప్రత్యక్షంగా కలుసుకొని పోల్ చిట్టీలు అందిస్తూ ఓటు అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో 52 మంది అ భ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్పేపర్ఉపయోగిస్తున్నారు.
యాదాద్రిలో 37 పోలింగ్సెంటర్లు..
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యాదాద్రి జిల్లాలో భువనగిరి డివిజన్లో 22 పోలింగ్సెంటర్లు, చౌటుప్పల్ డివిజన్లో 15 పోలింగ్సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 17 మండలాల్లో 34,080 మంది పట్టభద్రలైన ఓటర్లు ఉన్నారు. భువనగిరి డివిజన్లో 7,784 మంది మహిళలు, 12,421 మంది పురుషులు, చౌటుప్పల్ డివిజన్ సంబంధించి 5,458 మంది మహిళలు, 8,417 మంది పురుష ఓటర్లు ఉన్నారు. భువనగిరి, చౌటుప్పల్లోని డిస్ట్రిబ్యూషన్సెంటర్ల నుంచి పోలింగ్సామగ్రిని సిబ్బందికి అందించారు. సామగ్రి అందుకున్నస్టాఫ్ సూచించిన 10 రూట్ల ద్వారా పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో తమకు కేటాయించిన పోలింగ్సెంటర్లకు వెళ్లిపోయారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ హనుమంతు జెండగే , డీసీపీ రాజేశ్ చంద్రతో కలిసి సందర్శించారు.
సూర్యాపేట జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు..
సూర్యాపేట జిల్లాలో 51,477 మంది గ్యాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట డివిజన్ లో 31 పోలింగ్ కేంద్రాలు, కోదాడ డివిజన్ లో 22 పోలింగ్ కేంద్రాలు, హుజూర్ నగర్ డివిజన్ లో 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 16 మంది తహసీల్దార్లను సెక్టార్ అధికారులుగా, పీవోలు, ఏపీవోలతోపాటు 340 మంది సిబ్బందిని నియమించారు. 19 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు. 800 మంది ఓటర్లు ఉన్నచోట జంబో పోలింగ్ బాక్సులను ఉపయోగించనున్నారు. మొత్తం 16 రూట్ల ద్వారా పోలీస్ బందోబస్త్ మధ్య ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
నల్గొండ జిల్లాలో 80,559 మంది ఓటర్లు
నల్గొండ జిల్లాలో 80,559 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 51,370 మంది, మహిళలు 29,189 మంది ఓటర్లు ఉన్నారు. 95 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మిర్యాలగూడ డివిజన్పరిధిలో 24,211 మంది ఓటర్లు, నల్గొండ డివిజన్ పరిధిలో 36,492, చండూరు డివిజన్ పరిధిలో 8,270, దేవరకొండ డివిజన్ పరిధిలో 11,586 మంది ఓటర్లు ఉన్నారు.