తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జగదీశ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. నల్లగొండలోని అమర వీరుల స్తూపం వద్ద శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నివాళులర్పించి కలెక్టరేట్లో జెండాను ఆవిష్కరించారు. ఆయాచోట్ల కలెక్టర్లు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. మంత్రి, శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్యేలు తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ లో కలెక్టర్ ఎస్. వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లిన చల్లమల్ల నరసింహ, కట్ల సైదులు, తోట లక్ష్మీనారాయణ, సుభాష్ ను సన్మానించారు. ఆయా చోట్ల ఇతర బీజేపీ లీడర్లు పాల్గొన్నారు. నల్లగొండలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ ఫొటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు ఆఫీస్ నుంచి గడియారం సెంటర్ లోని అమరవీరుల స్తూపం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. స్తూపానికి, మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నల్గొండ, హాలియాలో సోనియాగాంధీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. సూర్యాపేటలో కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పార్టీ ఆఫీస్ వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి, కొత్త బస్ స్టాండ్ వద్ద సోనియా గాంధీ ఫొటోకు పాలాభిషేకం నిర్వహించారు. సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ అనంతుల మధు జెండాను ఆవిష్కరించారు. ఆయా చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - వెలుగు, నెట్వర్క్