- చైర్మన్ డబ్బులివ్వట్లే, కస్టమర్లు భూములు తీసుకోవట్లే..ఇద్దరి మధ్య నలిగి చనిపోవాలని డిసైడయ్యా: భాస్కర్‍రెడ్డి
- జనవరి 25న సూసైడ్ నోట్
- కస్టమర్లకు న్యాయం చేయాలని సీపీకి వినతి
- చిట్‍ఫండ్ చైర్మన్, ఎండీ అరెస్ట్
- మృతదేహంతో కేయూ పీఎస్ ముందు బాధితుల ధర్నా
వరంగల్, వెలుగు: ‘నా చావుకు కారణం కనకదుర్గ చిట్‍ఫండ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, కమలాకర్ రెడ్డి. నేను ఈ సంస్థలో కొన్ని కోట్ల రూపాయల డిపాజిట్లు చేయించడంతో పాటు చిట్టీలు కట్టించా. వాళ్లకు అమౌంట్ఇవ్వకుండా ల్యాండ్ఆఫర్ చేశారు. వారు మాత్రం డబ్బులే కావాలని నావెంట పడుతున్నారు. సంస్థ చైర్మన్ డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడ్తున్నాడు.
నాకు ఏం చేయాలో తెలియక చనిపోవాలని డిసైడ్ అయ్యా. వరంగల్ పోలీస్ కమిషనర్ దయచేసి బాధితులకు న్యాయం చేసి..చిట్‍ఫండ్ సంస్థపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కనకదుర్గ చిట్‍ఫండ్ ఏజీఎంగా పనిచేసిన నల్ల భాస్కర్‍రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. ఆయన ఆదివారం హనుమకొండ హరిత హోటల్లో ఆత్మహత్య చేసుకోగా 10 రోజుల ముందు తేదీతో రాసినట్టుగా ఉన్న నోట్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అందులో ఐదుగురు కస్టమర్ల పేర్లు..వారికి ఇవ్వాల్సిన రూ.కోటి 15 లక్షల లెక్కలు రాశాడు.
చైర్మన్, ఎండీ అరెస్ట్
భాస్కర్‍రెడ్డి సూసైడ్ నోట్, మృతుడి భార్య షామిలి ఫిర్యాదు మేరకు కనకదుర్గ చిట్‌ఫండ్స్ చైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డిని సుబేదారి పోలీసులు, మేనేజింగ్ డైరెక్టర్ కొండం కమలాకర్‍రెడ్డిని కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబం భాస్కర్‍రెడ్డి మృతదేహంతో కేయూ గోపాల్‍పూర్ జంక్షన్‍లో ఉన్న చిట్‍ఫండ్ మెయిన్ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధమవగా పోలీసులు వారించారు.
ఈ క్రమంలో తిరుపతిరెడ్డి కేయూ పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న సమాచారంతో బాధిత కుటుంబం, బంధువులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పీఎస్ వద్దకు చేరుకున్నారు. చిట్‍ఫండ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ఫ్లెక్సీలు పట్టుకొsతతని నిరసనకు దిగారు. కరీంనగర్, వరంగల్ మెయిన్ రోడ్‍పై స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చట్ట ప్రకారం కోర్టులో శిక్ష పడేలా చూస్తామని..సీఐ అబ్బయ్య, సిబ్బంది వారిని సముదాయించారు.