- జలపాతాలు, శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన అభయారణ్యం
- కొండల నడుమ ఆకట్టుకునే కృష్ణానది అందాలు
- డెవలప్మెంట్కు ప్రపోజల్స్ రెడీ చేయాలని చెప్పిన రాష్ట్ర సర్కారు
- నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల నల్లమల పర్యటన
నాగర్ కర్నూల్, వెలుగు : పులులు, శైవ క్షేత్రాలు, జలపాతాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ర్ట సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనే దానిపై ప్రపోజల్స్ రెడీ చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన శుక్ర, శనివారాల్లో ఉమ్మడి పాలమూరుకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నల్లమల అటవీ ప్రాంతంలో పర్యంటించనున్నారు.
చూడదగ్గ ప్రదేశాలెన్నో..
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. ఈ అభయారణ్యం పెద్ద పులులకు నిలయం. అటవీ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 26 పెద్ద పులులు ఉన్నాయి. కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో పెద్ద, చిన్న జలపాతాలు దాదాపు 20కి పైగానే ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం, సలేశ్వరం, లొద్ది, అంతర్ గంగ, భైరవ గుండం, మునీశ్వర జలపాతాలున్నాయి.
జతపాతాలు ఉన్న ప్రాంతాల సమీపంలోనే శైవ క్షేత్రాలు ఉండడం విశేషం. అలాగే సోమశిలలోని సోమేశ్వర ఆలయాలు, ఐలాండ్‌గా పేరొందిన అమరగిరి, చీమలతిప్ప ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వీటితో పాటు జటప్రోలు ఆలయం, సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రత్యేకమైనవి. నల్లమల చెంచుల ఆరాధ్య దైవమైన భౌరాపూర్ అమ్మవారి ఆలయం, మద్దిమడుగు అంజన్న ఆలయం నల్లమలలో ప్రసిద్ధి చెందినవి.
అడవి మధ్యలో కృష్ణమ్మ అందాలు..
కృష్ణానది జూరాల తర్వాత శ్రీశైలం చేరుకుంటుంది. దాదాపు 78 కిలోమీటర్ల మేర నల్లమలలో ప్రవహిస్తుంది. నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో వ్యూ పాయింట్లు ఆకట్టుకుంటాయి. ప్రధానంగా కొల్లాపూర్ వద్ద కృష్ణమ్మ అందాలు స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ కొండల నడుమ నుంచి పాయలుగా నది ప్రవహిస్తుంది. కొల్లాపూర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మీదుగా ప్రయాణిస్తే ఆంకాళమ్మ కోటకు చేరుకోవచ్చు. అలాగే అక్క మహాదేవి గుహలను సందర్శించవచ్చు. వీటితో పాటు గీసుగండి రివర్ పాయింట్, గున్నంపెంట వ్యూ పాయింట్, ఆక్టోపస్ వ్యూ పాయింట్ల వద్ద పచ్చని కొండల నడుమ ప్రవహించే కృష్ణమ్మ అందాలను చూడొచ్చు.
అభివృద్ధికి ప్రణాళికలు
నల్లమలలో ఎకో టెంపుల్స్, రివర్ టూరిజం ప్రాంతాల అభివృద్ధికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన రెండు రోజుల పాటు నల్లమలలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఉమామహేశ్వర క్షేత్రంలో పూజలు చేసి టూర్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మన్ననూర్లోని ఈఈసీ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్, బయో ల్యాబ్‌ను సందర్శిస్తారు.
‘తెలంగాణ అమర్నాథ్ యాత్ర’గా పేరున్న సలేశ్వరం చేరుకొని, అక్కడి నుంచి జంగిల్ సఫారీలో ఫర్హాబాద్ వ్యూ పాయింట్ పరిశీలిస్తారు. రాత్రికి ప్రాజెక్టు వద్ద బస చేయనున్నారు. శనివారం ఉదయం శ్రీశైలంలో మల్లికార్జున, భ్రమరాంబిక దేవిల దర్శనం తర్వాత రివర్ బోటింగ్, అక్క మహాదేవి గుహలను సందర్శిస్తారు. అనంతరం దోమలపెంట మయూరి గెస్ట్ హౌజ్‌లో రివ్యూ నిర్వహిస్తారు.
కాగా, ప్రస్తుతం నల్లమలలో అడవి జంతువుల సంభోగ సమయం కారణంగా జులై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 31 వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవి లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ కారణంతో మంత్రి జూపల్లి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల రెండు రోజుల నల్లమల పర్యటనకు మీడియాకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.