
కొల్లాపూర్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో పలు చోట్ల మంటలు అంటుకున్నాయి. 15 రోజులుగా మంటలు చెలరేగుతుండడంతో విలువైన వృక్ష సంపద అగ్నికి ఆహుతి అవుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎండిన గడ్డి, కర్రల కారణంగా మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. నల్లమలలోని పెగ్గర్లపెంట, జాలుపెంట, చుక్కలగుండం, పాలమాకుల, తొంగిచూపులులలో ఫిబ్రవరి 22 నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఫారెస్ట్ రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు.
మంటలను ఆర్పేందుకు 50 మంది ఫారెస్ట్ సిబ్బంది బ్లోయర్స్‌తో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మంటలు ఆర్పివేస్తున్నామన్నారు. శివస్వాములకు, అటవీ ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు అవగాహన కల్పించినా వారు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఎవరూ అగ్గిపెట్టెలతో అడవిలోకి వెళ్లొద్దని స్పష్టం చేశారు.+