ఖమ్మం, వెలుగు : తనను మళ్లీ గెలిపించి పార్లమెంట్ కు పంపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బిడ్డనైన తనను భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి పార్లమెంట్ కు పంపాలని కోరారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని నియోజక వర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్ట పడి పని చేశారని, వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న తనను కాపాడుకోవాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజలపైనే ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు తీసుకొచ్చానని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఐదు ప్రధాన కులాలకు చెందిన వారిని కేబినెట్ లోకి తీసుకోకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు.