బీసీ, మహిళా బిల్లులపై ఒత్తిడి పెంచుతం: నామా

న్యూఢిల్లీ, వెలుగు: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. సమావేశాలు సజావుగా జరిపేందుకు అన్ని పార్టీల వారి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్రం కోరింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు హాజరయ్యారు. ఓబీసీలు, మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ  బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మీటింగ్ అనంతరం నామా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

 

Also Rard: కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​..జూనియర్‍ మెడికోను కొట్టిన సీనియర్లు

మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుపై తెలంగాణ తీర్మానం చేసి, కేంద్రానికి పంపినా ఇంతవరకు పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వారి హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని నామ చెప్పారు. బీసీలు, మహిళా హక్కుల సాధనకు, వారికి ఉన్నత స్థానం కల్పించేందుకు బీఆర్ఎస్ తరపున పార్లమెంట్లో  గళం వినిపిస్తామన్నారు. బీసీ, మహిళా  బిల్లులు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించేలా పోరాడతామన్నారు. అలాగే రాష్ట్ర విభజన హామీలు, మిగతా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.