
- ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు
- కొత్త కార్డుల జారీలో గందరగోళం
హైదరాబాద్, వెలుగు: కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు ఐదేండ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లను చేర్చాలని పేరెంట్స్దరఖాస్తు చేసుకుంటే, అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది.
కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెండ్లయి, రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా, ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధనే ఇందుకు కారణం.
ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకుని, కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారు. పాత కార్డుల్లో పేరు ఉన్నవారిని పక్కనపెట్టారు. ఈ విషయం తెలియని దరఖాస్తుదారులు తమకు కార్డులు రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
స్కీమ్‌లకు దూరమైతున్నరు..
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజులుగా నిరంతర ప్రక్రియగా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ఇచ్చి, వాటిని పంపిణీ చేయడంలో సివిల్సప్లయ్స్అధికారులు వెనుకబడ్డారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ స్కీములకు దూరమవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాతో పాటు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి.
ఇప్పటికే నాలుగైదుసార్లు రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినా.. ఇంతవరకు పంపిణీ ప్రారంభించలేదు. రేషన్‌కార్డులు ఎలా ఉండాలనే దానిపైనా అధికారుల్లో స్పష్టత లేదు. ఒకసారి ఏటీఏం కార్డు సైజు అని, ఇంకోసారి పోస్టు కార్డు సైజు అని, క్యూఆర్ కోడ్‌తో ఉంటుందని, స్మార్ట్‌కార్డు మాదిరి చిప్‌తో ఇస్తామని రకరకాలుగా చెబుతుండటంతో జనంగందరగోళానికి గురవుతున్నారు.
ఇప్పటికే నాలుగు సార్లు అప్లికేషన్లు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 మధ్య గ్రామసభల్లో మరోసారి అప్లికేషన్లు స్వీకరించారు. కులగణన సర్వేలోనూ రేషన్‌కార్డులు లేని వారి వివరాలు సేకరించారు. మీ సేవ కేంద్రాల్లోనూ రేషన్‌కార్డుల కోసం నిరంతరం అప్లికేషన్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇప్పటి వరకు కొత్త రేషన్‌కార్డులు, కుటుంబ సభ్యుల యాడింగ్, తొలగింపు కోసం 30 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో డూప్లికేట్లు తీసేయగా.. కొత్తగా రేషన్ కార్డులకు కనీసం 10 లక్షల అప్లికేషన్లు అర్హమైనవిగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు.