- కామారెడ్డి మున్సిపాలిటీలో లక్కీ డ్రాలో 720 మందికే ఇండ్లు
- అప్లికేషన్లు 5,047 వస్తే.. అర్హులైన వారు 3,450 మంది..
- ఆఫీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్న పేదలు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుడు షురూ అయినప్పటి నుంచి తమకు ఇల్లు వస్తుందని వేలాది మంది ఇండ్లు లేని పేదలు ఆశగా ఎదురు చూశారు. అందరికీ ‘డబుల్’ ఇండ్లు వస్తయంటే ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సగం మంది మాత్రమే ‘డబుల్’ ఇండ్ల కు అర్హులని అధికారులు లిస్ట్ రూపొందించారు. తీరా ఇండ్లు పంచే సమయానికి లక్కీ డ్రా తీసిన అధికారులు కొందరినే ఎంపిక చేశారు. దీంతో ఆరేడేండ్లుగా ‘డబుల్’ ఇండ్లు ఎప్పుడు పంచుతరోనని ఆశగా ఎదురు చూసిన పేదలకు నిరాశే మిగిలింది. ఆఫీసర్ల లిస్టులో తమ పేరున్నా.. లక్కీ డ్రాలో అన్యాయం జరిగిందని, ఇండ్లు లేని తమకు ‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలని వారు ప్రభుత్వ ఆఫీసులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
మున్సిపాలిటీలో పరిస్థితి..
కామారెడ్డి పట్టణంలో లక్షకు పైగా జనాభా నివసిస్తోంది. వీరిలో చాలా మంది ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో, గుడిసెల్లో నివసిస్తున్నారు. 2014లో పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించడమే కాకుండా మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీ, రామేశ్వర్‌పల్లి, దేవునిపల్లి, ఇల్చిపూర్, టెకిర్యాల్ శివార్లలో ప్రభుత్వం 720 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. నిర్మాణం పూర్తి చేసి కూడా ఆరేండ్లు దాటింది. సదరు ఇండ్ల కోసం కొన్ని నెలల కింద ప్రజల నుంచి అధికారులు అప్లికేషన్లను స్వీకరించగా.. పట్టణంలో మొత్తం 5,047 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని వార్డుల వారీగా విభజించి ఆఫీసర్లు, సిబ్బంది కలిసి ఆధార్, సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా 3,450 మందిని అర్హులుగా గుర్తించారు.
అప్లై చేసుకున్న వారిలో అర్హులు ఎక్కువగా ఉండటం, ఇండ్లు తక్కువగా ఉండటంతో ఇటీవల వార్డుల వారీగా లక్కీ డ్రా తీశారు. అర్హులైన వారి లిస్టులో ఉన్న వారి పేర్లను లక్కీ డ్రాలో వేసి ఎంపిక చేశారు. అర్హులుగా ఉండి ఇండ్లు రాని వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ వీరంతా ఆందోళనకు దిగారు. చాలా మంది కలెక్టరేట్, మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు. కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి తమకు ఇండ్లు వచ్చేలా చూడాలని మొరపెట్టుకుంటున్నారు. అర్హత ఉన్నప్పటికీ లక్కీ డ్రాలో తమకంటే బెటర్‌గా ఉన్నవారికి ఇండ్లు వచ్చాయని, తమకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
30 ఏండ్లుగా గుడిసెలో ఉంటున్నం
కామారెడ్డి వీక్లీ మార్కెట్ ఏరియాలో గుడిసెల్లో 30 ఏండ్లుగా ఉంటున్నాం. రాళ్లు కొట్టుకుని బతుకుతున్నాం. డబుల్‌బెడ్ రూం ఇల్లు కోసం అప్లై చేశాం. లిస్టులో పేరు వచ్చినప్పటికీ లక్కీ డ్రాలో రాలేదు. ఇల్లు వస్తుందనే ఆశతో ఏండ్ల తరబడి చూస్తే తీరా గిప్పుడు మాకు రాలేదని చెబుతున్రు. - అలకుంట సారక్క, కామారెడ్డి
కిరాయి ఇంట్లో ఉంటున్నం
15వ వార్డులో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. నా భర్త చనిపోయిండు. నేనే కూలి పనిచేసి ముగ్గురు పిల్లలను పోషిస్తున్నా. ఒక బిడ్డ పెండ్లి చేశా. ఇంకా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్రు. కూలి నాలి కుటుంబ పోషణకే సరిపోతుంది. ఇంటి కిరాయి కట్టలేకపోతున్నా. లిస్టులో పేరు వచ్చినప్పటికీ నాకు ఇల్లు రాలేదు. ప్రభుత్వం స్పందించి నాకు గూడు కల్పించాలి. - రేసు భాగ్య, కామారెడ్డి