- ఏడాది కూడా తిరగకముందే ఆరిపోయిన లైట్లు
- రూ.21.85 లక్షలు వృథా... మళ్లీ రూ.20 లక్షలతో ఏర్పాటు
- మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గం తీరుపై విమర్శలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ పాలకవర్గం, అధికారుల అనాలోచిత చర్యలతో ప్రజాధనం వృథా అవుతోంది. బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజలకు ఉపయోగం లేని పనులు చేస్తూ ఫండ్స్‌ను దుబారా చేస్తున్నారు. పైపై మెరుగుల కోసం లక్షల రూపాయలు దారబోయడమే కాకుండా అందులోనూ కమీషన్లు దండుకుంటున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నా తప్పులను సరిదిద్దుకోవడం లేదు. పైగా మళ్లీ మళ్లీ అవే తప్పులు చేసేందుకూ ఏమాత్రం వెనుకాడడం లేదు.
రూ.21.85 లక్షలు వృథా
మంచిర్యాల మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా 2020 అక్టోబర్‌లో ఎల్ఈడీ రోప్ లైటింగ్ సిస్టమ్ పేరుతో రూ.21.85 లక్షలు వృథా చేశారు. నస్పూర్ వెళ్లే ఆర్వోబీపై రెండు వైపులా ఈ లైట్లను అమర్చారు. అక్కడి నుంచి ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, లక్ష్మీ టాకీస్ చౌరస్తా మీదుగా ఏసీసీ వరకు డివైడర్ల మధ్యలోని పోల్స్‌కు వీటిని ఏర్పాటు చేశారు. ఐబీ చౌరస్తా నుంచి పాత మంచిర్యాల వరకు, బెల్లంపల్లి చౌరస్తా నుంచి బస్టాండ్ , రైల్వేస్టేషన్ మీదుగా ముఖరం చౌరస్తా వరకు, మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం వరకు, అలాగే కాలేజీ రోడ్డులో గోదావరి వరకు ఈ లైట్లను ఏర్పాటు చేశారు.
మార్కెట్‌రేటు కంటే మీటర్‌కు రూ.60 అదనంగా చెల్లించి కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఏడాది కూడా తిరగక ముందే ఎల్ఈడీ రోప్ లైట్లు నిర్వహణ లోపంతో ఆరిపోయాయి. తొమ్మిది నెలలకే లైటింగ్ సిస్టం ఫెయిలైనప్పటికీ అధికారులు రిపేర్లు చేయించలేదు. నాసిరకం పనులు చేసినట్టు ఆరోపణలు వచ్చినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
మళ్లీ రూ.20 లక్షలతో ఏర్పాటు
ఎల్ఈడీ రోప్ లైటింగ్ సిస్టం ఫెయిలైనప్పటికీ పాలకవర్గం, అధికార యంత్రాంగం గుణపాఠం నేర్చుకోలేదు. మరోసారి రూ.20 లక్షలు వెచ్చించి మళ్లీ రోప్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్తగా బైపాస్ రోడ్లో రూ.10 లక్షలతో, రైల్వేస్టేషన్ రోడ్డు, బెల్లంపల్లి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు, కాలేజీలో రోడ్డులో మరో రూ.10 లక్షలు, మొత్తం రూ.20 లక్షలు ఎల్ఈడీ రోప్ లైటింగ్‌కు కేటాయించారు. పట్టణంలోని మెయిన్ రోడ్లపై చాలాచోట్ల ఎల్ఈడీ లైట్లు వెలగక చీకట్లు అలుముకున్నాయి. నైట్‌టైమ్‌లో రోడ్లపై ఏముందో కనిపించక ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్నారు. వీటిపై దృష్టి సారించని యంత్రాంగం ప్రజలకు ఏమాత్రం అవసరం లేని రోప్ లైట్లను ఏర్పాటు చేయడం ఎందుకన్న చర్చ జరుగుతోంది.
బ్యూటిఫికేషన్లో భాగంగానే....
మంచిర్యాల మున్సిపాలిటీ బ్యూటిఫికేషన్లో భాగంగానే అన్ని రోడ్లపై డివైడర్ల మధ్యలోని పోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు, రోప్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయడానికి రూ.10 లక్షలతో ఇటీవల టెండర్లు నిర్వహించాం. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేదు. గడువు తీరే వరకు మెయింటెనెన్స్ బాధ్యత కూడా కాంట్రాక్టర్‌దే.
మారుతీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్
కమీషన్ల కోసమే....
అధికార పార్టీ సభ్యులు, అధికారులు కుమ్మక్కై ప్రజలకు అవసరం లేని పనులు చేస్తున్నారు. గతంలో రోప్ లైటింగ్ ఏర్పాటు పేరిట భారీగా అవినీతికి పాల్పడ్డారు. ప్రజాసమస్యలపై దృష్టి సారించకుండా మరోసారి కమీషన్ల కోసమే రోప్ లైటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
వేములపల్లి సంజీవ్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్