పట్టాలో ఒకరి పేరు..ఎన్వోసీలో మరొకరి పేరు

పట్టాలో ఒకరి పేరు..ఎన్వోసీలో మరొకరి పేరు
  • అర్హులైన పేదల స్థానంలో లీడర్లు, అధికారుల చుట్టాల పేర్లు
  • అధికార పార్టీ నాయకుల అండతోనే దందా

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ శివారులోని మావల పక్కన ఉన్న 170 సర్వే నంబర్లో పదేండ్ల క్రితం 1,200 మంది పేదలకు ఇచ్చిన భూమి అది. ఈ ల్యాండ్కు రేట్ పెరగడంతో స్థానిక లీడర్ల కన్ను పడింది. అక్కడే తిష్ఠ వేసి సగానికిపైగా ఆధీనంలోకి తీసుకున్నారు. ప్లాట్లను పక్కదారి పట్టిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ కనుసన్నల్లో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. పట్టా ఒకరి పేరుమీద ఉంటే, ఎన్వోసీ మరొకరికి ఇవ్వడం ప్రారంభించారు. ఆ ప్లాట్లకు కరెంట్ కనెక్షన్ఇవ్వాలంటే కరెంటోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వస్తున్న వాటిలో సగానికి పైగా ఎన్వోసీల్లో పట్టా నంబర్ ఒకరిది.. పేరు మరొకరిది ఉంటోంది. ఇలా తప్పుల తడకగా ఎన్వోసీలు వస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అర్హులైన పేదల స్థానంలో లీడర్లు, అధికారుల చుట్టాలు పెద్ద సంఖ్యంలో ఎన్వోసీలు తెచ్చుకుంటున్నారు. 

మీడియా కాలనీ పేరుతో మాయ 
ఆదిలాబాద్ పట్టణ శివారులోని న్యూ హౌసింగ్ బోర్డు సమీపంలోని 170 సర్వే నంబర్లో 1,200 మంది పేదలకు స్థలాలు కేటాయించారు. ఇందులోనే కొందరు మీడియా ఫొటోగ్రాఫర్లకు  కూడా ప్లాట్లు ఇచ్చి దానిపేరు మీడియా కాలనీ అని పెట్టారు. 2025 సంవత్సరం వరకు ఈ స్థలాలను లబ్ధిదారులు అమ్ముకోడానికి వీలు లేదు. అయితే కాలనీ పేరు చెప్పుకుని కొంతమంది లీడర్లు ప్లాట్లను హాట్ కేకుల్లా ప్లాట్లు అమ్ముకుంటున్నారు. అర్హులకు పదేళ్ల  క్రితమే స్థలాలు కేటాయించినప్పటికీ, ఇటీవలే వీరికి పట్టాలు అందజేశారు. పట్టాలు ఇచ్చే క్రమంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. నిజమైన లబ్ధిదారుల స్థానంలో డబ్బులిచ్చినవారు, అధికారులు, లీడర్ల చుట్టాలకు కూడా ఇల్లు కట్టుకునే పర్మిషన్ వచ్చింది. నిర్మాణాల కోసం కరెంటు అవసరముంటుందని అందరూ ట్రాన్స్కో అధికారులను కలిశారు. వారు సంబంధిత తహసీల్దార్ఆఫీస్ నుంచి ఎన్వోసీ తీసుకువస్తే నే కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దీంతో అంతా తహసీల్దార్ ఆఫీస్కు వెళుతున్నారు. మొదట కొందరికి రూల్స్ ప్రకారమే ఎన్వోసీలు ఇచ్చినప్పటికీ, తర్వాత డూప్లికేట్ఎన్వోసీలు బయటకు రావడం మొదలైంది. రూ.10 వేలు తీసుకుని ఓ గ్యాంగ్ ఇలా డూప్లికేట్ దందా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అనర్హులు అక్కడ ఇళ్లు కడుతుండడంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పరిస్థితి గందరగోళం
మావల 170 సర్వే నంబర్లో గతంలో కేటాయించిన ప్లాట్ల విషయంలో గందరగోళ పరిస్థితి ఉంది. నిజమైన అర్హుల స్థానంలో కొందరు వేరేవారు ఉంటున్నట్లు కంప్లైంట్స్ వచ్చాయి. ఎంక్వైరీ చేస్తున్నాం. అక్కడున్న వారిలో ధనికులు కూడా ఉన్నట్లు తెలిసింది.–వనజా రెడ్డి, తహసీల్దార్, మావల మండలం