ఎల్లారెడ్డిపేట, వెలుగు : యూనిక్ కంపెనీ పేరుతో ఓ వ్యక్తి 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలో శనివారం వెలుగుచూసింది. వెంకటాపురానికి చెందిన దీకొండ సునీల్ యూనిక్ కంపెనీ పేరుతో మహిళల నుంచి నెల నెలా డబ్బులు వసూలు చేశాడు. 46 నెలలు కడితే డబుల్ ఇప్పిస్తానని చెప్పడంతో పోతిరెడ్డిపల్లి, అగ్రహారం, వెంకటాపురం, హరిదాస్ నగర్, పధిర, ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రమాలకు చెందిన 200 మంది మహిళలు సునీల్ కు డబ్బులు ఇచ్చారు. 56 నెలలు గడిచినా డబ్బులు ఇప్పించకపోవడంతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యూనిక్ కంపెనీ బ్రాంచ్ కు వెళ్లి అడిగారు.
దీంతో సునీల్ కు కంపెనీతో సంబంధం లేదని నిర్వాహకులు చెప్పడంతో శనివారం సునీల్ ఇంటికి వచ్చి నిలదీశారు. తమ డబ్బులు వెంటనే ఇప్పించాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని సునీల్‌ను స్టేషన్ కు తరలించారు. మహిళలు ఎల్లారెడ్డిపేట స్టేషన్ కు వచ్చి తమ డబ్బులు ఇప్పించాలని కోరగా, విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎస్సై రమాకాంత్ హామీ ఇచ్చారు.