శిలాఫలకంపై కనిపించని జడ్పీ ఛైర్ పర్సన్ పేరు.. చిచ్చు రేపిన ప్రోటోకాల్ వివాదం

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ అభివృద్ధి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. శిలాఫలకంపై జడ్పీ ఛైర్ పర్సన్ పేరు కనపడకపోవడంతో అది గొడవకు దారి తీసింది. కేంద్ర ఔషధ గిడ్డంగి, 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో అధికారుల తీరుపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

 శంకుస్థాపనలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలపై జడ్పీ చైర్ పర్సన్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం అనంతరం గమనించిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలలో జడ్పీ పేరు తప్పకుండా ఉండాలని సూచించారు. వెంటనే  శిలాఫలకాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని నాయకులు అధికారులకు మార్గనిర్దేశం చేశారు.