- డబుల్ ఇండ్ల డ్రాలో పేరొచ్చింది..లిస్టులో మాయమైంది
- వికలాంగుడి ఆత్మహత్యాయత్నం
- గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో పెట్రోల్ పోసుకున్న షాలీమియా
- అడ్డుకుని నీళ్ళు పోసిన పోలిసులు
- కుటుంబంతో కలిసి సూసైడ్ చేసుకుంటానని బాధితుడి హెచ్చరిక
గద్వాల, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు డ్రాలో పేరు వచ్చినా లిస్టులో లేకపోవడంతో కలత చెందిన ఓ వికలాంగుడు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌లో గురువారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం..గద్వాల టౌన్ లోని 15 వార్డుకు చెందిన షాలీమియా అనే వికలాంగుడు డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎలిజిబుల్ లిస్టులో పేరు రాగా, ఇటీవల ఎంపీడీవో ఆఫీస్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ లక్కీ డ్రా తీశారు.
ఇందులో వికలాంగుల కోటాలో టోకెన్ నెంబర్ 27 పై షాలీమియాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో గాని..ఆఫీసర్లు విడుదల చేసిన లిస్టులో పేరు కనిపించలేదు. దీంతో గురువారం తన గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్ కు వెళ్లాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులు అడ్డుకొని అతడిపై నీళ్లు గుమ్మరించారు. తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సెలింగ్ఇచ్చారు. బాధితుడు మాట్లాడుతూ న్యాయంగా తనకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
ఈ విషయమై 15 వ వార్డు కౌన్సిలర్ బంగి ప్రియాంక మాట్లాడుతూ డ్రాలో షాలీమియా పేరు వచ్చింది నిజమేనని, తర్వాత పేరు ఎలా మారిందో తెలియదన్నారు. బాధితుడికి న్యాయం చేయకపోతే ధర్నా చేస్తామని ఎంఐఎం గద్వాల టౌన్ ప్రెసిడెంట్ బంగి సుదర్శన్ హెచ్చరించారు. దీనిపై గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎవరి పేరు తొలగించలేదని, అన్ని సర్టిఫికెట్లు వెరిఫై చేసిన తర్వాత బాధితుడికి డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని చెప్పారు.