- కొత్తగా విద్యుత్ సంస్థల బోర్డులు ఏర్పాటు
- టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్,
- టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కోగా మార్పు
- టీఎస్ ఆర్టీసీ.. టీజీఎస్ ఆర్టీసీగా చేంజ్
- కొత్త లోగో విడుదల చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు టీఎస్ స్థానంలో టీజీని చేర్చుతున్నాయి. ప్రభుత్వం టీఎస్‌ను టీజీగా మారుస్తూ ఇటీవల జీవో విడుదల చేసింది. ఈ మేరకు అన్ని సంస్థలు మార్పులు చేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభుత్వ సంస్థల పేర్లను అధికారులు మారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఎస్ ఎస్పీడీసీఎల్ ను టీజీ ఎస్పీడీసీఎల్గా, టీఎస్ ఎన్పీడీసీఎల్ ను టీజీ ఎన్పీడీసీఎల్గా, టీఎస్ జెన్కోను టీజీ జెన్కోగా, టీఎస్ ట్రాన్స్‌కోను టీజీ ట్రాన్స్‌కోగా మార్చారు.
ఈ మేరకు కొత్త బోర్డులను ఆయా విద్యుత్ సంస్థల కార్యాలయాల ముందు ఏర్పాటు చేశారు. అలాగే, విద్యుత్ సంస్థల వెబ్ సైట్లు, విద్యుత్ బిల్లుల రిసిప్టుల్లోనూ టీఎస్ స్థానంలో టీజీని చేర్చుతున్నారు. కాగా, టీఎస్ ఆర్టీసీ పేరు కూడా టీజీఎస్ ఆర్టీసీగా మారింది. లోగోలోనూ మార్పులు చేశారు.