శిలాఫలకంపై కార్పొరేటర్ల భర్తల పేర్లు 

శిలాఫలకంపై కార్పొరేటర్ల భర్తల పేర్లు 

మేడిపల్లి, వెలుగు: డివిజన్​  కార్పొరేటర్​ పేరు ఒకటైతే.. శిలాఫలకం మీద ఇంకోలా కనిపిస్తోంది. పాలకవర్గంలో లేకపోయినా కార్పొరే టర్ల భర్తల పేర్లు ఫలకాల మీదకి ఎక్కుతున్నాయి. ఎన్నికల అఫిడవిట్​లో అధికారికంగా రికార్డు అయిన పేరు  కాకుండా.. భర్త పేరును కూడా జోడించడం  విస్మయంగా మారుతోంది. బోడుప్పల్​ కార్పొరేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలపై భర్తల పేర్లుకూడా కనిపించడం విమర్శలకు దారితీస్తోంది. పదవిలో ఎవరుంటే వారే అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలని గతంలో  మంత్రి కేటీఆర్  చెప్పినప్పటికీ... తాజాగా బుధవారం ఆయన ఆవిష్కరించబోయే పనుల్లోనే కార్పొరేటర్ల పేర్ల పక్కన భర్తల పేర్లు అదనంగా ఉండటం  చర్చనీయాంశంగా మారింది.  శిలాఫలకాలపై భర్తల పేర్లు రాయడంపై బోడుప్పల్ కార్పొరేషన్ డీఈ కుర్మయ్య మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు డీఆర్వో ఆదేశాలతో వాటిని ఏర్పాటు చేసినట్లు ఈఈ భద్రయ్య చెప్పారు. దీనిపై స్పందించిన డీఆర్వో లింగ్యానాయక్ తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.  జీవో 520 ప్రకారం ప్రొటోకాల్ ను అనుగుణంగా అఫిడవిట్​లో ఉన్న విధంగానే శిలఫలకాలపై కార్పొరేటర్ల పేర్లు ఉండాలని అందుకు విరుద్ధంగా ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ ను వివరణ కోరగా.. ‘ ఈ విషయంపై ఉన్నతాధికారులకు లెటర్ రాశామన్నారు. వాళ్ల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.