T20 World Cup 2024: ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘటన.. నమీబియా క్రికెటర్ రేర్ రికార్డు

T20 World Cup 2024: ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘటన.. నమీబియా క్రికెటర్ రేర్ రికార్డు

నమీబియా బ్యాటర్ నికోలస్ డేవిన్ సరికొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో రిటైర్ అయిన మొదటి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శనివారం(జూన్ 15) రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఇక్కడ మరో విషయమేమిటంటే.. అతను గాయపడి మైదానాన్ని వీడలేదు. పరుగుల వేటలో వెనుకబడ్డాడని తప్పించారు.

వర్షం కారణంగా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. అనంతరం చేధనకు దిగిన నమీబియా ఓపెనర్లు ధాటిగా ఆడలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లు రీస్ టోప్లీ, సామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్ కట్టుదిట్టంగా బంతులేయడంతో డేవిన్ బౌండరీలు సాధించలేకపోయాడు. దాంతో, నమీబియా టీమ్ మేనేజ్మెంట్ అతన్ని రిటైర్ అవ్వాల్సిందిగా ఆదేశించింది. చేసేదేమిలేక అతను చిరునవ్వుతో మైదానాన్ని వీడాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ వీస్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి జట్టు మేనేజ్‌మెంట్ చర్యను సమర్థించేలా చేశాడు.

చట్టాలు ఏమి చెప్తున్నాయి..

MCC (మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్) చట్టాలు ఆర్టికల్ 25.4.2 ప్రకారం.. ఒక బ్యాటర్ అనారోగ్యం, గాయం లేదా మరేదైనా అనివార్య కారణాల వల్ల తప్పుకుంటే, అతను/ఆమె తిరిగి బ్యాటింగ్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అదే 25.4.2లోని నిబంధనలు కాకుండా మరేదైనా కారణంతో రిటైరైతే, సదరు బ్యాటర్ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ సమ్మతితో మాత్రమే తిరిగి బ్యాటింగ్ చేయవచ్చు. ఇక్కడ అతను తిరిగి బ్యాటింగ్‌కు రానియెడల 'రిటైర్డ్ అవుట్'గా నిర్ణయిస్తారు.