గత ఏడాది నమీబియా నుంచి తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా మార్చి 27న మరణించింది. సాషా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. సాషాను భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వెల్లడించారు. పార్క్‌లోని ఇతర చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. సాషా రోజువారీ పర్యవేక్షణ తనిఖీలో భాగంగా బాగా అలసటగా ఉన్నట్టుగా కనిపించిందని అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 17న కునోలో ప్రధాని మోడీ విడుదల చేసిన ఐదేళ్ల వయసున్న రెండు ఆడ పెద్ద పిల్లులలో సాషా చిరుత ఒకటి.
గత వారం మధ్యప్రదేశ్‌లో ఎల్టన్ , ఫ్రెడ్డీ అనే మరో రెండు చిరుతలను అడవిలోకి వదిలారు. దీంతో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో నాలుగింటిని షియోపూర్ జిల్లాలోని పార్క్‌లోని అడవిలోకి వదిలారు. మరోవైపు హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మార్చి 25న చిరుతపులి మృతి చెందింది. దీని వయసు 15 ఏళ్లు కాగా, జూలో ఉన్న ఏకైక చిరుత ఇదే కావడం గమనార్హం. నెహ్రూ జూపార్క్‌కి ఈ చిరుత 2013లో సౌదీ నుంచి వచ్చింది.