- 83 ఏనుగులను చంపి ప్రజలకు మాంసం పంపిణీ
- కరువును ఎదుర్కొనేందుకు నమీబియా నిర్ణయం
- మొత్తం 723 వన్యప్రాణులను వధించాలని ప్లాన్
- దేశంలో పూర్తిగా అడుగంటిన నీటి వనరులు
- జంతువులను చంపితే ఒత్తిడి తగ్గుతుందని యోచన
విండ్‌హోక్: ఆఫ్రికా దేశమైన నమీబియాలో తీవ్ర కరువు నెలకొంది. తినేందుకు తిండి, తాగేందుకు నీరు లేక అక్కడి ప్రజలు విలవిలలాడుతున్నారు. దీంతో ప్రజల ఆకలిని తీర్చేందుకు నమీబియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ అడవుల్లో సంచరించే 83 ఏనుగులతో సహా 723 వన్యప్రాణులను చంపి.. ఆ మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
లిస్టులో 30 హిప్పోలు(నీటి గుర్రాలు), 60 గేదెలతో పాటు 50 ఇంపాలా(ఒకరకమైన జింకలు), 100 బ్లూ వైల్డ్‌బీస్ట్, 300 జీబ్రాలు, 100 ఎలాండ్లు ఉన్నాయని నమీబియా పర్యావరణ, అటవీ పర్యాటక శాఖ వెల్లడించింది. ప్రొఫెషనల్ వేటగాళ్లతో వీటిని చంపనున్నట్లు తెలిపింది. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంత ప్రజల ఆకలి తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
కరువు ఎందుకొచ్చిందంటే..
దేశంలో కరువు నెలకొనడానికి అడవుల్లో వన్య ప్రాణుల సంఖ్య అధికంగా ఉండటమే కారణమని నమీబియా పర్యావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. జంతువులు ఎక్కువగా.. నీటి వనరులు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఎండ తీవ్రతకు అడవిలో నీరు లేకపోవడంతో వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపింది. అవసరానికి మించి ఉన్న వన్య ప్రాణులను వధిస్తేనే దేశంలో నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది.
ఆఫ్రికాలో దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి. గతేడాది నీటి వనరులు ఎండిపోవడంతో వందలాది ఏనుగులు మరణించాయి. ఇప్పటికే ఆ దేశంలో కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడానికి 157 అటవీ జంతువులను వధించి, 56,800 కిలోల మాంసం పంపిణీ చేశారు. తమ దేశ రాజ్యాంగాన్ని అనుసరించే జంతువులను విధించినట్లు అధికారులు తెలిపారు. సహజ వనరులను నమీబియా పౌరుల ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నామని సమర్థించుకున్నారు.
84% ఆహార నిల్వలు ఖాళీ
కరువు రావడంతో గత నెల నమీబియా అత్యవసర పరిస్థితిని ప్రకటించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నమీబియా ఆహార నిల్వలలో ఇప్పటికే 84% అయిపో యిందని.. రానున్న రోజుల్లో దేశ జనాభాలో దాదాపు సగం మందికి తిండి దొరకక పోవచ్చని అభిప్రాయపడింది. జింబాబ్వే, జాంబియా, బోట్స్వానా, అంగోలా, నమీబియా దేశాలలో విస్తరించి ఉన్న అడవిలో 2 లక్షల కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే ఏనుగులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పిలుస్తారు. 2014లో ఏనుగుల వేటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కానీ, కరువు నేపథ్యంలో స్థానికుల ఒత్తిడికి తలొగ్గి 2019లో దీనిని తొలగించింది.