పంచాయతీ కార్యదర్శికి ఏడాది జైలుశిక్ష

పంచాయతీ కార్యదర్శికి ఏడాది జైలుశిక్ష
  • నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు  

నిజామాబాద్, వెలుగు: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో నిజామాబాద్ జిల్లా కోటగిరి కార్యదర్శికి ఏడాది జైలుశిక్ష, రూ. 40వేల జరిమానా విధిస్తూ  నాంపల్లి ఏసీబీ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఏసీబీ డీఎస్పీ శేఖర్​గౌడ్​తెలిపిన ప్రకారం... కోటగిరి మండల కేంద్రానికి చెందిన వడ్డే లింగయ్య మరణించగా ఇద్దరు కొడుకుల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. తండ్రి పేరుతో ఉన్న ఇంటిని సోదరుడి పేరుతో మార్చమని వడ్డే నర్సింహులు 2014లో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్​కు దరఖాస్తు ఇచ్చాడు.

 రూ.10 వేలు లంచం డిమాండ్ చేయగా.. రూ.8 వేలకు కుదుర్చుకుని నర్సింహులు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. లంచం తీసుకుంటుండగా కార్యదర్శి సుదర్శన్​ను ఏసీబీ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకొని కేసు నమోదు చేసింది.  నిందితుడికి నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్​అఫ్రోజ్​అక్తర్​ఏడాది జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఫైన్ కట్టలేకుంటే అదనంగా నెల రోజులు జైలులో నిందితుడు ఉండాలని ఆదేశించారు.