బీఆర్ఎస్ ​లీడర్ ​ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్.. కండిషనల్​ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు

బీఆర్ఎస్ ​లీడర్ ​ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్.. కండిషనల్​ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు

సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్​లీడర్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మాసబ్​ట్యాంక్​ పోలీసులు గురువారం వెస్ట్​మారేడ్​పల్లిలోని ఆయన ఇంట్లో అరెస్ట్​ చేశారు. బంజారాహిల్స్ పీఎస్ లో తన విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేయడంతో హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్​పై కేసు నమోదైంది. ఇప్పటికే కౌశిక్​రెడ్డిని అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్​మంజూరు చేసింది. 

రెండు సార్లు నోటీసులు అందుకున్నప్పటికీ ఎర్రోళ్ల శ్రీనివాస్​ విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం తెల్లవారుజామున వెస్ట్​మారేడ్​పల్లిలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన ఎర్రోళ్ల డోర్​క్లోజ్​చేశారు. ఎంత పిలిచినా తీయలేదు. మరోవైపు అరెస్ట్​ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్​శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎర్రోళ్ల ఇంటికి వచ్చి ఆందోళనకు దిగారు.

పోలీస్​వాహనాన్ని అడ్డుకున్నారు. ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో వాహనానికి అడ్డువచ్చిన బీఆర్ఎస్​కార్యకర్తలను పక్కకు లాగేసి ఎర్రోళ్లను అరెస్ట్​చేసి వ్యాన్ లో మాసబ్​ట్యాంక్ పీఎస్​కు తరలించారు. చింతల బస్తీలోని సెంటర్​లో కొవిడ్​టెస్ట్, ఉస్మానియాలో ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నాంపల్లి పీఎస్​కు తరలించగా మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద్ ఎర్రోళ్లను కలుసుకున్నారు. తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు రూ.5 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్​మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.