చాంద్రాయణగుట్ట, వెలుగు: బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఫలక్నుమా పరిధిలోని జహనుమా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫరీద్(45) 2020లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం ఈ కేసు పూర్వాపరాలను నాంపల్లి కోర్టు జడ్జి అనిత పరిశీలించి, నిందితుడికి జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా వేధించింది.
బాలికను వేధించిన యువకుడికి మూడేండ్ల జైలు
బషీర్ బాగ్ : బాలికను సోషల్ మీడియాలో వేధించిన కేసులో ఓ యువకుడికి న్యాయస్థానం మూడేండ్ల జైలుశిక్ష విధించింది. కాచిగూడ సీఐ చంద్రకుమార్ వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతి జిల్లా వాకాడ మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎంబటి మహేశ్(30) హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. 2022లో బర్కత్ పురాకు చెందిన 14 ఏండ్ల బాలికను మానసికంగా , లైంగికంగా వేధించాడు. వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో మెసేజ్ లు పెట్టేవాడు. ఈ ఘటనపై ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి 12వ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి టి.అనిత బుధవారం తీర్పునిచ్చారు. మహేశ్ కు మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించారు.