- ఆయనే ప్రధాన నిందితుడు
- శ్రవణ్ రావు ఆచూకీ కనుక్కోండి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు
- అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న పోలీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును కోర్టులో ప్రత్యక్షంగా హాజరు పర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసును ఇవాళ విచారించిన కోర్టు ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు హాజరు కాకుండా ఎలా విచారణ చేపట్టాలని పోలీసులను ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ1 ను విచారించలేమని చెప్పింది.
అలాగే ఫోన్ ట్యాపింగ్ కోసం పరికరాలను కొనుగోలు చేసిన మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు ఆచూకీ కనుక్కొని ప్రత్యక్షంగా హాజరు పర్చాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు, ఏ6గా ఉన్న శ్రవణ్ రావుపై ఇప్పటికే వారెంట్లు జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరు పర్చాలని సూచించింది. తన క్లయింట్ అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతున్నారని, వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరవుతారంటూ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావును రప్పించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు , శ్రవణ్ రావులను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, శ్రవణ్‌రావు ఆచూకీని దర్యాప్తు బృందం కనిపెట్టలేకపోయింది. శ్రవణ్‌రావు ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లే యోచనలో దర్యాప్తు బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమంతా ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే జరిగిందని, ఎస్‌ఐబీలో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంలోనూ ప్రభాకర్ రావే ప్రధాని సూత్రధారి అని సిట్ తేల్చింది. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు సిట్ నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.