పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ A-11గా ఉన్నాడు. దీంతో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ ని నాంపల్లి కోర్టు శుక్రవారం పరిశీలించింది.
ఇందులోభాగంగా హీరో అల్లు అర్జున్ పై పెట్టిన BNS 105 వర్తించదని, సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతికి ఆయన కారణం కాదని అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో కోర్టు వీరి వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అలాగే 50 వేలు నగదు, 2 పూచీకత్తుతో ఈ బెయిల్ ని మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కి కొంతమేర ఊరట లభించిందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 04న పుష్ప 2 ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. దీంతో అల్లు అర్జున్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలసి డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. బన్నీ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారి అతనిని చూసేందుకు ఎగబడ్డారు.
ఈ సమయంలో తొక్కిసలాట జరగ్గా రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. దీంతో అల్లు అర్జున్ అండ్ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యం, మరింత మందిపై పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.