మందు, గంజాయి కోసం తల్లిని చంపిండు

హైదరాబాద్‌, వెలుగు: తల్లిని చంపిన కొడుకుకు నాంపల్లి కోర్టు​ జీవిత ఖైదు విధించింది. యావజ్జీవ ఖైదుతోపాటు రూ.10వేల జరిమానా విధించి మంగళవారం తీర్పు వెల్లడించింది. బల్కంపేటకు చెందిన బకనంద సంతు(22) మద్యం, గంజాయికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తన తల్లి సంగీత(50)ని వేధించేవాడు. ఈ క్రమంలో 2021 జనవరి 9న తల్లితో గొడవపడ్డాడు. మధ్యాహ్నం సమయంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపు భాగంలో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. సంతును అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నాంపల్లిలోని ఫస్ట్‌ అడిషనల్‌ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో  చార్జ్​షీట్‌ దాఖలు చేశారు. జడ్జి డి రమాకాంత్ ప్రాసిక్యూషన్‌ అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించి సంతును దోషిగా తేల్చారు. జీవితఖైదును ఖరారు చేసి తీర్పు చెప్పారు.