హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్‎టెండ్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్‎టెండ్

హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు గుడ్ న్యూస్ చెప్పారు. నుమాయిష్‎ను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 2025, ఫిబ్రవరి 15వ తేదీతో నాంపల్లి నుమాయిష్ ముగియనుంది. ఈ క్రమంలో నుమాయిష్‎ను మరో రెండు రోజులు పొడిగించాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‎ను మంగళవారం (ఫిబ్రవరి 11) ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు కోరారు. సొసైటీ సభ్యుల విజ్ఞప్తికి సానూకూలంగా స్పందించిన సీపీ సీవీ ఆనంద్.. ఎగ్జిబిషన్‎ను రెండు రోజులు పొడిగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. 

దీంతో ఫిబ్రవరి 17వ తేదీ వరకు  నాంపల్లి నుమాయిష్ కొనసాగనుంది. ఇప్పటి వరకు నుమాయిష్‎కు వెళ్లని వారు వెళ్లే అవకాశం దక్కింది.  ఈ నెల 17 వరకు నుమాయిష్ కొనసాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి తెలిపారు. 2025, జనవరి 3వ తేదీన నాంపల్లి నుమాయిష్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్‎ను ప్రారంభించారు. 

నుమాయిష్‎లో ఈసారి రెండు వేల స్టాళ్లు ఏర్పాటు చేయగా ఎంట్రీ ఫీజును రూ.50గా నిర్ణయించారు. మినీ ట్రైన్‎తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్​కొనసాగుతుంది.  కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అన్ని రకాల వస్తువులను నుమాయిష్ లోని రెండు వేల స్టాల్స్‎లో ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో సొసైటీ పలు విద్యాసంస్థలను నిర్వహిస్తోంది.