పాపం పండింది.. బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్

హైదరాబాద్ లోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కార్యాలయాల్లో బాంబ్ ఉందంటూ జూన్ 12వ తేదీ బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని నాంపల్లి పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జైని రాధాకృష్ణ (43) అనే వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులను టార్గెట్ చేసి, పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలని కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే జూన్ 12న అతని సెల్ ఫోన్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు కాల్ చేశాడు. మాసబ్ ట్యాంక్ లోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ టవర్స్, బషీర్ బాగ్ లోని ఆయాకర్ భవన్, కవాడిగుడలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కార్యాలయంలో బాంబ్ ఉందని బెదిరించాడు.

ఆ బాంబ్ ఎక్కడ ఉందో చెప్పాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిందితుడి వద్ద నుంచి కాల్ రాగానే పోలీసుల, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే నిందితుడు చెప్పిన అన్ని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. 

ఉద్యోగులను బయటకు పంపించి సోదాలు చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని తేల్చారు. కావాలనే బాంబు ఉందని చెప్పి.. బెదిరింపులకు గురి చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న నాంపల్లి పోలీసులు.. ఫేక్ కాల్ పై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. 

నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆదివారం (జూన్ 18వ తేదీన) హయత్ నగర్ లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాధాకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.