పశుసంవర్థక శాఖ కార్యాలయంలో చొరబడి ఇంపార్టెంట్ ఫైల్స్ చించేసి, తీసుకెళ్లిన మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి (డిసెంబర్ 8) మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్థక శాఖ డిపార్టెంట్ కు వచ్చి సిబ్బంది సాయంతో ఫైల్స్ చించేశారు మాజీ ఓఎస్డీ కళ్యాణ్. అనంతరం సంచుల్లో ఫైల్స్ ను తీసుకెళ్లారు.
ప్రభుత్వం మారడంతో గతంలో తాము పనిచేసినప్పటి అన్ని ఫైల్స్ కళ్యాణ్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు పనిచేయకుండా కేబుల్స్ పీకేసీ ఫైల్స్ చించేశారని పోలీసులు కేసు చేశారు. ఈ కేసులో పశుసంవర్థక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, అతనికి సహకరించిన కంప్యూటర్ ఆపరేట్ ఎలిజా, మోహన్, అటెండర్స్ వెంకటేష్, ప్రశాంత్లపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.
మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్థక శాఖలో ఫైల్స్ అదృశ్యంపై ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు డీసీపీ శ్రీనివాస్. ఫైల్స్ మాయవడంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు డీసీపీ. ఈ విషయంపై డైరెక్టర్ ను ప్రశ్నించారు డీసీపీ. ఫైల్స్ మాయవడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని డైరెక్టర్ డీసీపీకి చెప్పడం గమనార్హం.