- అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా బ్యూటిఫికేషన్
సికింద్రాబాద్, వెలుగు: సిటీలోని రైల్వే స్టేషన్లు కొత్త కళను సంతరించుకోనున్నాయి. నాంపల్లి రైల్వేస్టేషన్‌తో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు ఆధునీకరించనున్నారు. ‘అమృత్ భారత్’ రైల్వేస్టేషన్లఅభివృద్ధి స్కీమ్‌లో భాగంగా రూ.310 కోట్లతో వీటిని అందంగా తీర్చిదిద్దనున్నారు. కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
నిజాం కాలంలో సిటీ నడిబొడ్డున కట్టిన నాంపల్లి రైల్వే స్టేషన్‌కు116 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 30 వేల మంది ప్యాసింజర్లు వెళ్తుంటారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి 83 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి. బేగంబజార్, మొజంజాహీ మార్కెట్వంటి వ్యాపార సముదాయాలకు అనువైనది కావడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యధిక పార్సిళ్ల బుకింగ్‌లు ఇక్కడే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఆధునీకరిస్తున్న నాంపల్లి స్టేషన్ వద్ద ఆఫీసులను భారీగా విస్తరించనున్నారు. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇప్పుడున్న స్టేషన్ ముందు భాగం పూర్తిగా మార్పుచేయనున్నారు. ఈ స్టేషన్నుంచి మెట్రో స్టేషన్‌కు నేరుగా ర్యాంపును కూడా నిర్మించనున్నారు.
రూపురేఖలు మారనున్న ఎంఎంటీఎస్ స్టేషన్లు
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 512 రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తుండగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 50 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సిటీలోని హఫీజ్‌పేట,హైటెక్‌సిటీ, మలక్‌పేట,ఉప్పుగూడ, బేగంపేట ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉండగా ఒక్కోస్టేషన్కు రూ.36 కోట్ల నుంచి రూ.40 కోట్లతో కొత్తగా రూపొందిస్తారు. స్టేషన్లకు ఇరువైపులా ఎంటర్, ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక ర్యాంపులు, రూఫ్ ప్లాజా, పార్కింగ్ఏరియా, స్టేషన్‌కు రోడ్డు కనెక్టివిటీ, రైళ్ల రాకపోకలపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అందించేందుకు డిస్ప్లే సిస్టమ్, వెయిటింగ్ హాల్స్‌వంటి ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్యాసింజర్లు ఒక వైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు మెట్ల మార్గంతో పాటు ఎస్కలేటర్ల ఏర్పాటు, అవసరమైన చోట లిఫ్టులు కూడా నిర్మిస్తారు. వచ్చే ఏడాది నాటికి స్టేషన్లు కొత్త హంగులతో కనువిందు చేయనున్నాయి.