మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు

మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు
  • నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ


హైదరాబాద్‌‌, వెలుగు: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. హీరో నాగార్జున వేసిన క్రిమినల్‌‌, పరువునష్టం దావా కేసులో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాంపల్లి మనోరంజన్‌‌ కాంప్లెక్స్‌‌లోని ఎక్సైజ్‌‌ స్పెషల్‌‌ కోర్టు గురువారం విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. 

అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్‌‌పై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌పై కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఓపెన్‌‌ కోర్టులో నాగార్జున సహా సాక్షులుగా ఉన్న యార్లగడ్డ సుప్రియ, మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. నాగార్జున అందించిన ఆధారాలను పరిగణలోకి తీసుకున్నారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కొండాకు జారీ చేసిన నోటీసుల్లో కోర్టు పేర్కొంది.