హైదరాబాద్,వెలుగు: మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ కోర్టు సోమవారం విచారణ జరిపింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు, వాటికి సంబంధించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుంది. ఫిర్యాదుదారుడైన కేటీఆర్‌తో పాటు సాక్షుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసేందుకు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.అక్కినేని నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండా సురేఖ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.ఆమె చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గురువారం నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్,తుల ఉమ,దాసోజు శ్రవణ్‌లను పేర్కొంటూ 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. మీడియా, సోషల్ మీడియా, పత్రికల్లో భారీగా ప్రచారం జరిగిందని వివరించారు. పొలిటికల్ కెరీర్‌తో పాటు సమాజంతో తనకు ఉన్న పరువు ప్రతిష్టల గురించి పిటిషన్‌లో వెల్లడించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, శ్రవణ్ వాంగ్మూలాన్ని ఈ నెల 18న కోర్టు రికార్డు చేయనుంది.