మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. నాగార్జున పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని విచారించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సురేఖ చేసిన కామెంట్స్​రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

దుబ్బాకలో ఎంపీ రఘునందన్​రావు  చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే.. ఆ ఫొటో కింద  నీచమైన కామెంట్లు పెట్టి సోషల్​మీడియాలో ట్రోల్​ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అప్పట్లో కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్​ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా.. ‘ఆమెవి దొంగ ఏడుపులు.. ఆ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకో అర్థం కాలేదు’ అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘దొంగ ఏడుపులు నాకు అవసరం లేదు, నీకు తల్లి లేదా?’ అని కేటీఆర్ను సురేఖ ప్రశ్నించారు.

హీరో నాగచైతన్య, సమంత దంపతుల విడాకులకు కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అని అన్నారు. ఆయన బాధకు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకున్నారని చెప్పారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ  నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని అన్నారు.

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులోనే మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది.