MB Foundation: నమ్రతా బర్త్డే స్పెషల్ డ్రైవ్.. గ్రామీణ బాలికలకు HPV వ్యాక్సిన్‌.. ఈ వ్యాక్సిన్‌ లక్ష్యం ఇదే!

MB Foundation: నమ్రతా బర్త్డే స్పెషల్ డ్రైవ్..  గ్రామీణ బాలికలకు HPV వ్యాక్సిన్‌.. ఈ వ్యాక్సిన్‌ లక్ష్యం ఇదే!

మహేష్ బాబు ఫౌండేషన్ (MB Foundation) ఎంతో మంది చిన్నారులను కాపాడే ఓ దేవాలయం. ఈ MB ఫౌండేషన్ ద్వారా పిల్లలకు గుండె ఆపరేషన్లు, గ్రామీణ పిల్లలకు విద్య సహాయం, దూరపు ప్రాంతం నుండి నడిసొచ్చే విద్యార్థులకు సైకిళ్లు.. ఇలా ప్రతి సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటోంది. లేటెస్ట్గా MB ఫౌండేషన్ మరోసారి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  

నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా బుర్రిపాలెం గ్రామంలో ఎంబి ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 70 మంది బాలికలు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) మొదటి డోసు వ్యాక్సిన్‌ పొందారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో కీలకమైన పోషిస్తుంది. యువతుల ఆరోగ్యం మరియు ముందుతరాల భవిష్యత్తును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. 

తాజాగా మహేష్ బాబు సతీమణి నమ్రత ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. "నా పుట్టినరోజు సందర్భంగా, MB ఫౌండేషన్, ఆంధ్రా హాస్పిటల్ సహకారంతో బుర్రిపాలెం గ్రామంలో యువతుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక టీకా డ్రైవ్ నిర్వహించింది. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా 70 మంది బాలికలు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్‌ను పొందారని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము.

ఇది గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించడంలో ఒక ముఖ్యమైన దశ. ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని నిర్ధారించడానికి ఆరు నెలల విరామంతో రెండు మోతాదులను ఇవ్వాలి. అంకితభావంతో పనిచేసే ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ మరియు ఈ అర్థవంతమైన చొరవను నిజం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని నమ్రత తెలిపారు.