
బాలీవుడ్ ప్రముఖ నటి తనుశ్రీ దత్తా హిందీ విలక్షణ నటుడు నానా పాటేకర్ పై 2018లో లైంగిక వేధింపుల అభియోగాలు మోపుతూ ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే ఇటీవలే మళ్ళీ ఈ కేసుని ముంబై కోర్టు పరిశీలించింది. ఇందులోభాగంగా కేసు డీటెయిల్స్ ని పూర్తిగా పరిశీలించిన కోర్టు నానా పాటేకర్ కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
పూర్తివివరాల్లోకి వెళితే నటి తనుశ్రీ దత్తా 2008వ సంవత్సరంలో నానా పాటేకర్ తో కలసి 'హార్న్ ఓకే ప్లీజ్' అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్థించాడని అలాగే లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ 2018 అక్టోబర్ లో ముంబై పోలీసులకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా నానా పాటేకర్ తనతోపాటూ ఇతరులను కూడా లైంగికంగా వేధించినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు సంబంధిత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 354 మరియు 509 కింద కేసులు నమోదు చేశారు.
ALSO READ | పాన్ మసాలాని ప్రమోట్ చేసిన బడా హీరోలకి షాక్.. జైలు తప్పదంటూ..?
ఆ తర్వాత పోలీసులు ఈ కేసుని విచారించగా నానా పాటేకర్ పై మోపిన లైంగిక వేధింపుల అభియోగాలు నిరూపణ కాలేదు. అలాగే నానా పాటేకర్ పై చర్యలు తీసుకోవడానికి సరైన అధరాలు కూడా తనుశ్రీ కోర్టులో సమర్పించ లేకపోయింది. దీంతో కోర్టు సంఘటన జరిగిన 7 ఏళ్ళ తర్వాత ఫిర్యాదు చెయ్యడం, అలాగే నానా పాటేకర్ నేరం చేసినట్లు ఆధారాలు లేకపోవడం వంటి కారణాలతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాకుండా నానా పాటేకర్ పై నమోదైన కేసులను కూడా కొట్టి వేసింది. దీంతో నానా పాటేకర్ కి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు. అయితే ఈ కోర్టు తీర్పు అనంతరం నానా పాటేకర్ లేదా తనుశ్రీ దత్తా స్పందించకపోవడం గమనార్హం..