వర్షాకాలంలో జలపాతాల దగ్గర సందడిగా ఉంటుంది. అయితే వాటర్ ఫాల్స్‌ను ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుందని ఆ ప్లాన్ కాస్తా వాయిదా వేస్తారు చాలామంది. అలాంటి వారి కోసం సిటీకి దగ్గర్లోనే నానాజీపూర్ జలపాతం ఉంది. ఈ వీకెండ్‌కు ఇది పర్ఫెక్ట్ స్పాట్.
శంషాబాద్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది నానాజీపూర్ జలపాతం. తిమ్మాపూర్‌లో ఉన్న పాలమాకుల్ చెరువు నిండితే ఆ నీళ్లు హిమాయత్ సాగర్‌కు వెళ్తాయి. ఆ మధ్యలో ఉన్న వెడల్పాటి కొండరాళ్ల మీదుగా నీళ్లు జాలువారి నానాజీపూర్ జలపాతంగా మారాయి.
హనుమ లేని రామాలయం
ఈ వాటర్ ఫాల్‌కు దగ్గర్లో 17వ శతాబ్దంలో కట్టిన అమ్మపల్లి సీతా రామచంద్ర స్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో హనుమంతుడు ఉండడు. హనుమంతుడు రాముడ్ని కలవడానికి ముందే అరణ్యవాసంలో భాగంగా సీతారాములు ఇక్కడ అడుగుపెట్టారనీ.. అందుకే హనుమంతుడు లేకుండానే ఈ గుడిని కట్టారని చెప్తుంటారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగీని పాలించిన కల్యాణీ చాళుక్యులు కట్టించారు. ఈ ఆలయ గర్భగుడిలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిల మీద చెక్కారు. వేల ఏండ్ల నాటి బావి , తొంభై అడుగుల గాలి గోపురాన్ని ఇక్కడ చూడొచ్చు. ఫొటో, సినిమా షూటింగ్స్‌కు ఈ గుడి ఎంతో ఫేమస్.
ఇలా వెళ్లాలి
శంషాబాద్ నుంచి మల్కారం వెళ్లేటప్పుడు రాయన్నగూడకు ఎడమవైపు మళ్లితే నానాజీపూర్ వస్తుంది. శంషాబాద్ నుంచి చెర్లగూడ, పెద్దషాపూర్ రూట్‌లో కూడా వెళ్లొచ్చు.