- ధూల్‌పేటలో కట్టడితో కొత్త ఏరియాకు పెడ్లర్లు షిఫ్ట్
- పట్టుకోబోగా తప్పించుకున్న గంజాయి డాన్ నీతుబాయి
- శేరిలింగంపల్లి ఆఫీసర్ల అవినీతిపై ఎంక్వైరీ బృందం ఏర్పాటు
- ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ధూల్‌పేటలో గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతుండడంతో పెడ్లర్లు నానక్ రాంగూడ బాట పట్టారని, ముఖ్యంగా గంజాయి డాన్ నీతూబాయి అక్కడికి అడ్డా మార్చుకోగా పట్టుకోవడానికి వెళ్తే పరారైందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. నానక్‌రాంగూడలో గంజాయి అమ్మకాలను పూర్తిగా నిర్మూలించడం, నీతుబాయిని పట్టుకోవడమే ఇప్పుడు తమ ప్రధాన లక్ష్యమన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ధూల్‌పేటలో కట్టడి చేయడంతో గంజాయి వ్యాపారులు నానక్ రాంగూడకు తరలివెళ్లారు.
గంజాయి బిజినెస్‌లో ఆరితేరిన నీతుబాయి గతంలో ధూల్‌పేటలో చాలాసార్లు ఎక్సైజ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చింది. అయినా దందా కొనసాగిస్తుండడంతో గతంలో ఆమె, ఆమె కుటుంబానికి సంబంధించిన రూ.2 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశాం. దీంతో చోట్లు మారుస్తూ ఇటీవలే నానక్‌రాంగూడకు వెళ్లింది. అది తెలిసి పట్టుకోవడానికి వెళ్లగా, పారిపోయింది. నానక్‌రాంగూడలో నీతుబాయి గంజాయి అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అందుకే శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులపై విచారణకు బృందాన్ని ఏర్పాటు చేశాం. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.