తైవాన్లో బంకర్లుగా పార్కింగ్​ ప్లేస్, సబ్​వేలు

తైవాన్లో బంకర్లుగా పార్కింగ్​ ప్లేస్, సబ్​వేలు

కౌలాలంపూర్: అమెరికా సెనేట్‌‌ స్పీకర్‌‌ నాన్సీ పెలోసీ.. మంగళవారం రాత్రి తైవాన్​లో అడుగుపెట్టారు. తైపీ ఫారెన్​ మినిస్టర్​ జోసెఫ్​ వూ ఆమెకు స్వాగతం పలికారు.  చైనా వార్నింగ్స్​ను లెక్కజేయకుండా కౌలాలంపూర్​ నుంచి తైవాన్​ చేరుకున్నారు. తైపీ తమ దేశంలో అంతర్భాగమని, అక్కడ అడుగు పెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరించినా నాన్సీ వెనక్కి తగ్గలేదు. దీనికి ముందు మలేసియా పర్యటనలో భాగంగా పెలోసీ, ఆ దేశ ప్రధాని ఇస్మాయిల్​ సబ్రి యాకూబ్​తో మంగళవారం మధ్యాహ్నం లంచ్​ చేశారు. ‘‘స్పార్​–19” యూఎస్​ ఎయిర్​ఫోర్స్​ జెట్​లో  కౌలాలంపూర్​లోని సుభాంగ్​ ఎయిర్​పోర్టు నుంచి 3.40 గంటలకు టేకాఫ్​ అవ్వగా.. 8.15 గంటలకు తైపీ విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యారు. జియామెన్ ప్రాంతం చుట్టూ ఉన్న తైవాన్ జలసంధిని, తూర్పు తీర గగనతలాన్ని చైనా మూసివేయడంతో ఆమె విమానం తైపీ విమానాశ్రయంలో దిగింది. కౌలాలంపూర్​ నుంచి తూర్పు వైపు.. ఈశాన్య తైవాన్‌‌కు బదులుగా బోర్నియో ద్వీపం వైపు వెళ్లిన జెట్..  ఆ తర్వాత తైవాన్​ వైపు మళ్లింది. 

25 ఏండ్ల తరువాత..

కౌలాలంపూర్​ నుంచి టేకాఫ్​ అయిన జెట్, ఎక్కడికి వెళ్తుందో కూడా మలేసియా అధికారులకు చెప్పలేకపోయారు. 25 ఏండ్ల తరువాత అమెరికన్​ స్పీకర్​ తైవాన్​లో అడుగుపెట్టారు. నాన్సీ, ఆమె టీం మంగళవారం రాత్రి తైవాన్​లోనే బస చేస్తారు. నాన్సీకి వెల్​కం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎయిర్​పోర్టుకు వచ్చారు. అమెరికాకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

మేలు కోరి ఎవరొచ్చినా.. వెల్​కం : తైవాన్​

నాన్సీ పెలోసీ విజిట్​పై తైవాన్​ సీనియర్​ పొలిటీషియన్​ స్యూ ట్సెంగ్ చాంగ్ స్పందించారు. తైవాన్​ మేలు కోరేవారు ఎవరు వచ్చినా దేశం సాదరంగా ఆహ్వానిస్తుందని చెప్పారు. 

బంకర్లుగా పార్కింగ్​ ప్లేస్, సబ్​వేలు

చైనా వైమానిక దాడుల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు తైవాన్​ తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. మాల్స్​లోని కార్​ పార్కింగ్, సబ్​వేలను బంకర్లుగా ఉపయోగించుకుంటున్నది. తైపీలో 4,600కు పైగా ఉన్న ఇలాంటి షెల్టర్ల ద్వారా సుమారు 12 మిలియన్​ ప్రజలకు రక్షణ కల్పించవచ్చు. క్షిపణి దాడులు, కాల్పులు జరిగితే.. ప్రాణాలు ఎలా రక్షించుకోవాలన్న దానిపై 
మాక్​ డ్రిల్స్​ కూడా చేస్తున్నది.

సరిహద్దు వద్ద టెన్షన్.. 

చైనా-తైవాన్​ బార్డర్​ దగ్గర్లో చైనా వార్​ప్లేన్లు చక్కర్లు కొడుతున్నాయి. తైవాన్‌‌కు ఇరువైపులా చైనా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా కూడా తన యుద్ధ నౌకలను తైవాన్​ దగ్గర్లోని సముద్ర జలాల్లో మోహరించింది. అందులో ఫైటర్​ జెట్స్​ను మోసుకెళ్లే నౌక కూడా ఉంది. తైవాన్‌‌, ఫిలిప్పీన్స్‌‌కు తూర్పున, జపాన్‌‌కు దక్షిణాన ఫిలిప్పీన్స్ సముద్రంలో వార్​షిప్​ యూఎస్‌‌ఎస్‌‌ రొనాల్డ్‌‌ రీగన్‌‌ను మోహరించినట్లు అమెరికా ప్రకటించింది.  సాధారణ ప్రక్రియలో భాగంగానే మోహరింపు చేసినా.. అనుకోని సంఘటన ఎదురైతే దానికి తగినట్లుగానే తమ స్పందన ఉంటుందని హెచ్చరించింది.