బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో ముందుకెళుతోంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ‘నీటి సమస్య గురించి ప్రజలకు అవగాహన కలిగించిన సినిమా డాకు మహారాజ్. అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎంతో అందంగా ప్రతి ఒక్కరి నుంచి హావభావాలు రాబట్టుకుని, క్లుప్తంగా, అందంగా బాబీ రూపొందించాడు.
నా ఫ్యాన్స్ తమన్ ఇంటిపేరు నందమూరిగా మార్చారు. నేను ఎన్‌బీకే తమన్‌గా నామకరణం చేస్తున్నా. అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అర్థవంతమైన లిరిక్స్ రాశారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉన్న వంశీ లాంటి నిర్మాత నా అభిమాని కావడం గర్వంగా ఉంది. జనవరి 22న అనంతపురంలో విజయోత్సవ పండుగ నిర్వహించబోతున్నాం’ అన్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడో రోజుకే పెట్టిన డబ్బు వచ్చేసి హ్యపీగా ఉంటే దర్శకుడిగా అంతకంటే సంతోషం ఇంకేముంటుంది. సినిమాలు బ్లాక్ బస్టర్స్ వస్తాయి కానీ మాస్టర్ పీస్ తీశామనే రెస్పెక్ట్ రావడం ఫుల్ హ్యాపీ. అందుకు టీమ్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు.
నాగవంశీ మాట్లాడుతూ ‘బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ స్పందన లభించింది. రెండో రోజుకే మా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌కి వెళ్లడం మాకు పెద్ద సక్సెస్’ అని అన్నారు. హీరోయిన్స్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, సంగీత దర్శకుడు తమన్, బాలనటి వేద అగర్వాల్, లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.