భూ హక్కుల చట్టం పేరుతో ప్రజల ఆస్తులను కాజేసే కుట్రకు ముఖ్యమంత్రి జగన్ పన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు. నంద్యాల జిల్లా పాణ్యం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు, పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఫోటో ఉన్న పాస్ పుస్తకాన్ని చించి తగలబెట్టారు. పేదల ఆస్తిని కొల్లగొట్టే చట్టానికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చరమగీతం పాడతామని భరోసా ఇచ్చారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మండిపడ్డారు. మీ తాతలు, తండ్రులు ఇచ్చిన పాస్ పుస్తకాల పై జగన్ ఫొటో ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి అడిగితే నాపై కేసు పెడతా అంటున్నాడు అని చెప్పారు. ఏం చేసుకుంటావో చేసుకో అని సవాల్ విసిరారు. ఈ కాపీని మీ ముందే చించి, తగలబెడుతున్న అంటూ పాస్ పుస్తకాలకు నిప్పంటించారు. మీ భూములన్నీ ఆయన కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు. రాయలసీమలో 52 కి 52 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.