నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్లో వింత ఘటన చర్చనీయాంశమైంది. స్థానిక మహదేవుని ఆలయంలోని నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అందరూ నందిశ్వరునికి స్పూన్‌లతో పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్లు పట్టిస్తున్నారు. నందీశ్వరుడు వీటిని తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయింది.
నిజమేనా...
ఈ వింతను చూసేందుకు కమ్మరపల్లి మండలంలోని ఇతర గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. కొందరు ఈ వింతను నమ్మడం లేదు. అయితే స్వయంగ వచ్చి పాలు పట్టిస్తూ నిజమే అని నమ్ముతున్నారు. తమ గ్రామంలో నందీశ్వరుడు పాలు, నీళ్లు తాగడం పరమశివుడి లీలంటూ భక్తులు అనుకుంటు-న్నారు. ఆలయానికి వస్తున్న భక్తులు పరమశివుడిని దర్శించుకుని.. నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ పాలు, నీళ్లు పట్టిస్తున్నారు.
— GSREDDY (@GSreddymedia) July 24, 2023
నిజంగా విగ్రహం పాలు తాగుతుందా..?
నందీశ్వరుడి విగ్రహం పాలు తాగుతోందని భక్తులు అనుకుంటుంటే..దీని వెనుక అసలు రహస్యం వేరే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విగ్రహాలు పాలు తాగడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటున్నారు. ఒక స్పాంజ్‌ని తీసుకుని నీళ్లలో పెడితే సహజంగానే అది నీళ్లను పీల్చుకుంటుంది. దీన్నే తలతన్యత అంటారు లేదా సర్ఫేస్ టెన్షన్ అంటారు. ఈ సైన్స్ సూత్రం ఆధారంగానే మొక్కలు, చెట్లు తమ వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. ప్రస్తుతం దేవుడి విగ్రహాల విషయంలో జరుగుతున్నది కూడా ఇదే అంటున్నారు. కొన్ని రాతి విగ్రహాలు, ఇసుకరాయి లేదా మట్టితో తయారైన దేవుడి ప్రతిమలకు కొంతైనా నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. విగ్రహానికి స్పూన్‌తో గాని గ్లాస్‌తో గాని నీరు లేదా పాలు తాగించినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ విగ్రహం నీటిని పీల్చుకుంటుంది. సర్ఫేస్ టెన్షన్ అనే ప్రక్రియ వల్ల అలా జరుగుతుంది గాని దేవుడు పాలు తాగడం అనేది ఉండదంటున్నారు. అయితే బంగారం లేదా వెండితో తయారుచేసిన విగ్రహాలకు తాగించి చూడండి. పాలు, నీళ్లు తాగడం కనిపించదని చెప్తున్నారు.