నందిగ్రామ్‌‌‌‌ ఘటనతో మమతకు లాభమా? నష్టమా?

నందిగ్రామ్‌‌‌‌ ఘటనతో మమతకు లాభమా? నష్టమా?

పశ్చిమబెంగాల్‌‌‌‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మమతా బెనర్జీని అందరూ ఫైర్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ అంటూ ఉంటారు. మమత రాజకీయ ప్రత్యర్థులు ఏది ఊహించడంలో ఫెయిల్‌‌‌‌ అయ్యారో ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది. ప్రస్తుతం ఆమె దెబ్బతిన్న పులిలా వీల్‌‌‌‌చైర్‌‌‌‌ నుంచే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఆపడం ఎవరితరం కాదు. సాధారణ రాజకీయ ప్రచారానికంటే గాయపడిన మమత క్యాంపెయిన్‌‌‌‌ ఆమె రాజకీయ ప్రత్యర్థులకు మరింత డేంజర్‌‌‌‌గా మారింది. ఇప్పుడు, మమత పట్ల ప్రజల్లో సానుభూతి పెరగడంతో బెంగాల్‌‌‌‌ ఎన్నికల ప్రచారంలో జోరు పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే, ఈ ఎన్నికలు 1978 నాటి చిక్​మగళూర్‌‌‌‌ లోక్‌‌‌‌సభ ఎన్నికను గుర్తు చేస్తోంది. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీని ఆపేందుకు జనతా పార్టీ ఎంతో ప్రయత్నించి ఫెయిల్‌‌‌‌ అయ్యింది.

ప్రస్తుతం బెంగాల్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలపై నందిగ్రామ్‌‌‌‌ ఒక నీడలాగా మారింది. ల్యాండ్‌‌‌‌ అక్విజిషన్‌‌‌‌కు వ్యతిరేకంగా మమత చేపట్టిన పోరాటానికి నందిగ్రామే ప్రధాన కేంద్రం. అదే ఆమెను బెంగాల్‌‌‌‌ మొత్తానికి లీడర్‌‌‌‌ను చేసింది. 2011లో లెఫ్ట్‌‌‌‌ను గద్దె దించి అధికారం చేపట్టే వరకూ తీసుకెళ్లింది. మళ్లీ ఇప్పుడు నందిగ్రామే కేంద్రంగా రాజకీయ ప్రత్యర్థులతో మమత తలపడుతోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి తీవ్రమైన పోటీని మమత ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజకీయాన్ని మలుపుతిప్పే మంచి అవకాశం కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె ప్రత్యర్థులే ఆమెకు సులభంగా ఆ చాన్స్‌‌‌‌ ఇచ్చారు. 

నాటకీయ పరిణామాలు
బెంగాల్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ 8 దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే లాంగెస్ట్‌‌‌‌. బెంగాల్‌‌‌‌ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27న మొదలై.. ఏప్రిల్‌‌‌‌ 29న ముగుస్తుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. గాయపడిన మమత ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారని ఆమె ప్రత్యర్థులు భావించారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయనే ఆయుధం కూడా వారికి దొరికినట్లయ్యింది. అయితే ఈ రెండు విషయాల్లో వారి అంచనాలు తప్పాయి. మమత రాజకీయ ప్రత్యర్థులు ఒక కీలక విషయాన్ని ఈ సందర్భంగా మరిచిపోయారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌‌‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు నేరుగా ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోకి వెళ్లిపోతారు. నందిగ్రామ్​ ఘటన జరగడానికి ముందే బెంగాల్‌‌‌‌ డీజీపీని ఈసీ తొలగించింది. ఈ పాయింట్లను ఆమె ప్రత్యర్థులు మరిచిపోయారు. 

టీఎంసీలో చేరిన యశ్వంత్‌‌‌‌ సిన్హా
మమత గాయపడ్డారనే విషయం అందరికీ తెలుస్తున్నదే. అయితే ఈ ఘటనను టాప్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ లీడర్లు ఎవరూ ఖండించకపోవడం దారుణమైనది. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత మమతకు సపోర్ట్‌‌‌‌గా తృణమూల్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌లో చేరాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌‌‌‌ సిన్హా నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. వాజ్‌‌‌‌పేయికి యశ్వంత్‌‌‌‌ సిన్హా అత్యంత సన్నిహితుడు. వాజ్‌‌‌‌పేయి గవర్నమెంట్‌‌‌‌లో మమతాబెనర్జీ, యశ్వంత్‌‌‌‌ సిన్హా కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఉంది. నందిగ్రామ్‌‌‌‌లో మమతపై దాడి తర్వాత వారి మధ్య బంధం మరింత బలపడటమే కాదు. సింపతీ కూడా పెరిగింది. ఆయన మమతకు మద్దతునివ్వడంతో ఆమె క్యాంప్‌‌‌‌కు క్రెడిబులిటీ పెరిగింది. ఇదే సమయంలో ఆమె ప్రత్యర్థులకు క్రెడిబులిటీ దెబ్బతింది.

సంక్షేమమే ఆమె అజెండా
ఈ ఘటనపై గొడవ చేయడం, ప్రతీకారం తీర్చుకోవడం లాంటివి కాకుండా దానికి హ్యూమన్‌‌‌‌ టచ్‌‌‌‌ ఇచ్చే ప్రయత్నం చేశారు మమత. తనకు వ్యక్తిగత నొప్పి ఉన్నప్పటికీ, జనాల బాధలు తనను మరింత బాధపెడుతుందని మమత స్పష్టం చేశారు. నందిగ్రామ్‌‌‌‌లోని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌‌‌‌ అయిన తర్వాత వీల్‌‌‌‌ చైర్‌‌‌‌లోనే పురులియాలోని ఎలక్షన్‌‌‌‌ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ దాడితో నేను ఇంటికే పరిమితం అవుతానని కొంత మంది అనుకున్నారు. నా బాధ కంటే జనాల బాధే పెద్దది. అందుకే నేను వారి కోసం ముందుకు వెళ్లాలని డిసైడ్‌‌‌‌ అయ్యాను”అని చెప్పారు. ఆమె మాటలు ప్రత్యర్థులకు మింగుడుపడటం లేదు. రాజకీయ కక్ష సాధింపునకు తాను వ్యతిరేకమని మమత చెప్పడం ఆమె క్రెడిబులిటీని పెంచింది. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రజాస్వామ్య విధానంలో ముందుకెళుతున్న మమత.. సంక్షేమంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువకావడం ఆమె విశ్వసనీయతను పెంచింది. ఇప్పటికీ బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగించాలని నిర్ణయించడం మమత బ్రాండ్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌కు నిదర్శనంగా మారింది. ‘‘లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించిన తొలి మూడు నెలలు.. మేము ప్రతి కుటుంబానికి ఐదు కేజీల బియ్యం ఇచ్చాం. ఆ తర్వాత మూడు నెలలు ఐదు కేజీల బియ్యంతో పాటు అదే స్థాయిలో పిండిని ఒక్కో కుటుంబానికి అందించాం. ఈ ఏడాది జూన్‌‌‌‌ వరకూ ఉచిత రేషన్‌‌‌‌ను కొనసాగిస్తాం. కేంద్రం ఇచ్చే వాటికంటే మంచి బియ్యాన్ని మేము జనాలకు అందిస్తున్నాం. కేంద్రం ఫ్రీ రేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌తో బెంగాల్‌‌‌‌లోని 6 కోట్ల మంది లేదా 60 శాతం మంది మాత్రమే లబ్ది పొందుతారు. కానీ మేము పది కోట్ల మందికి సహాయం అందిస్తున్నాం”అని మమత చెప్పారు. మొత్తంగా నందిగ్రామ్‌‌‌‌ ఘటన బెంగాల్‌‌‌‌ రాజకీయాలను మలుపు తిప్పింది. అది మమతకు అనుకూలంగా మార్చింది. వీల్‌‌‌‌చైర్‌‌‌‌లో ప్రచారం చేస్తున్న మమత.. తన ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మమత ఒక స్ట్రీట్‌‌‌‌ ఫైటర్. కింది స్థాయి వరకూ ఆమె కనెక్ట్‌‌‌‌ అయ్యారు. అంత తేలికగా తల వంచే రకం కాదు.

యాక్సిడెంటా? ఎటాకా?
కోల్‌‌‌‌కతాలోని హజ్రా క్రాసింగ్‌‌‌‌ వద్ద గతంలో మావోయిస్టులు చేసిన దాడిలో మమతకు గాయాలయ్యాయి. ఆ తర్వాతా ఆమె పుంజుకున్నారు. ఇప్పుడు అలాంటి ప్రతిఘటననే ఇస్తోందామె. లెఫ్ట్‌‌‌‌ పాలనలో భౌతిక దాడులను ఎదుర్కొన్న మమత వాటికి ఎప్పుడూ భయపడలేదు. అలాంటి వాటికి భయపడి రాజకీయ యుద్ధరంగం నుంచి తేలికగా పారిపోయే మనిషి కాదు. మమతపై నందిగ్రామ్‌‌‌‌లో జరిగిన దాడి అందరినీ షాక్‌‌‌‌కు గురిచేసింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనేది అందరూ అంగీకరించే వాస్తవం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కెమెరామెన్ల బ్యాటరీలతో ఈ దాడి జరిగినా.. అది కెమెరాల్లో రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి నచ్చిన వాదన వారు వినిపించుకునే చాన్స్​ దొరికింది. అసలు ఈ ఘటన అనుకోకుండా జరిగిందా? కావాలని చేసినదా? అనేది ఇన్వెస్టిగేషన్‌‌‌‌లోనే తేలుతుంది. 

- వెంకట్‌‌‌‌ పర్సా, పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌